గణేష్ (ఫైల్) బ్రహ్మయ్య(ఫైల్)
ప్రకాశం, కొనకనమిట్ల: ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ఉసురు తీసింది. ఈ సంఘటన కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ అంబాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..అంబాపురం గ్రామానికి చెందిన యన్నాబత్తిన బాలంకారావు, కాశమ్మ దంపతుల కుమారుడు బ్రహ్మయ్య (14), వద్దిమడుగు గ్రామానికి చెందిన ముసుకు చినగురవయ్య, సుబ్బమ్మ దంపతుల కుమారుడు గణేష్(15) ఇద్దరు స్నేహితులు. గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న నీటి కుంటలో ఆదివారం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటికుంటలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నీటి కుంటదగ్గరకు వెళ్లి గణేష్, బ్రహ్మయ్య మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో గణేష్ మండలంలోని మర్రిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్నాడు.
వచ్చే నెలలో పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. అమ్మమ్మను చూ సేందుకు వారం క్రితమే గణేష్ అంబాపురం వచ్చాడు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన గణేష్ మృతి చెందటం తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. మరో విద్యార్థి బ్రహ్మయ్య విజయవాడలో 9వ తరగతి చదుతున్నాడు. బ్రహ్మయ్య తల్లిదండ్రులు బాలంకరావు, కాశమ్మలు విజయవాడలో ముఠా పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వగ్రామమైన అంబాపురం వచ్చారు. ఇంతలో ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర నాయక్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరనాయక్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment