
రాజంపేట: రాజంపేట–రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) స్పీడ్ బ్రేకర్ వద్ద శనివారం సాయంత్రం టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఇంటర్ విద్యార్థి యెద్దల రమేష్(17) దుర్మరణం చెందాడు. మృతుడు రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం బావికాడిపల్లె రామాపురం నడిమ అరుంధతీవాడకు చెందిన చిన్నయ్య, లక్షుమ్మ దంపతులకు రెండవ కుమారుడు. రమేష్ రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు. విద్యార్ధి మృతితో రామాపురం నడిమ అరుంధతీవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గైడ్ కోసం పట్టణంలోకి వచ్చి..
రమేష్, శ్యామ్‌కుమార్‌లు సైకిల్‌పై గైడ్ కొనుగోలు చేసేందుకు ఆర్వోబీ( రాయచోటి వైపు) నుంచి పట్టణంలోకి వచ్చారు. తిరిగి మళ్లీ కళాశాల వైపు వెళ్లే సమయంలో ఆర్వోబీ ఎక్కే సమయంలో అకస్మాత్తుగా వెనుకవైపు నుంచి రాయచోటి వైపు వెళుతున్న టిప్పర్ ఢీ కొంది. సైకిల్‌పై ఉన్న శ్యామ్‌కుమార్ ఎడమవైపు పడటంతో టిప్పర్ కింద పడకుండా తప్పించుకోగలిగాడు. అయితే రమేష్ మాత్రం టిప్పర్ వెనుక టైర్ల కింద పడటంతో తల నుజ్జునుజ్జు అయింది. అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
అరుంధతీవాడలో విషాద ఛాయలు...
రామాపురం నడిమ అరుంధతీవాడలో ఇంటర్ విద్యార్థి రమేష్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని టిప్పర్ ఢీ కొని నేరుగా వెళ్లిపోతుండగా స్థానికులు వెంబడించారు. ఆర్వోబీ ఆవలివైపు టిప్పర్‌ను నిలిపివేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం నుంచ బయటపడిన శ్యామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నారు.