ఇంట్లోకి దూసుకెళ్లినన ఐషర్‌లారీ
కడప–రేణిగుంట నేషనల్ హైవే రక్తసిక్తంగా మారింది. రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా నలుగురికి గాయాలయ్యాయి. రెండు లారీలు వేగంగా వస్తూ ఢీకొని పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లాయి. ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గ్రామస్తులు ధర్నాకు దిగారు.
సాక్షి, రాజంపేట: రాజంపేట రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఊటుకూరు గ్రామం వద్ద గుజరాత్‌కు చెందిన (జీజే06 ఏజెడ్1324) నంబరు గల కంటైనర్, చెన్నై నుంచి కడపకు వెళుతున్న ఐషర్ వాహనం (ఏపీ04యూఏ0459) అదుపుతప్పి ఢీకొన్నాయి. సమీపంలో ఉన్న రేకుల ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఇంటిలో ఉన్న వృద్ధుడు గొళ్ల వెంకటనరసయ్య (60) దుర్మరణం చెందాడు. అలాగే ఐషర్ వాహనంలో ఉన్న చింతకొమ్మదిన్నెకు చెందిన ప్రతాప్(27), కడపకు చెందిన మహమ్మద్ (29) మృతిచెందారు. గాయపడిన మునీశ్వరరెడ్డి(చింతకొమ్మదిన్నె), రాజారెడ్డి(గోపాలపురం), పరమేశ్వరరెడ్డి (చింతకొమదిన్నె), గంగిరెడ్డి(చింతకొమ్మదిన్నె)ని చికిత్స కోసం రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. రాజంపేట రూరల్ సీఐ నరసింహులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
హైవేపై ధర్నాకు దిగిన ఊటుకూరు గ్రామస్తులు
గ్రామస్తుల ధర్నా
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాము కొన్నేళ్లుగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదంటూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళన చేశారు. ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి, తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, స్థానిక వైఎస్సార్‌సీపీ నేత రేవరాజు శ్రీనివాసరాజు జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎస్‌ఐలు హనుమంతు, వినోద్ ట్రాఫిక్ క్లియరెన్స్‌కు చర్యలు తీసుకున్నారు.
ప్రమాదంపై ఆరా..
ఊటుకూరు వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment