ఫీజులు కాటేస్తున్నాయ్!
రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థుల తిప్పలు
సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: సురేష్ ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఎంటెక్ చేరేందుకు పీజీఈసెట్ రాసి పాసయ్యాడు. కానీ ఎంటెక్‌లో చేరలేని దుస్థితి. ఎందుకంటే బీటెక్ పూర్తిచేసిన సర్టిఫికెట్లను సదరు కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదు. 2014-15కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడమే దీనికి కారణం. 'ప్రభుత్వం 2014-15 నుంచి ఫీజులను కాలేజీలకు చెల్లించకుండా.. విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తామంటోంది. ఇప్పటికీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదు. మీరు సర్టిఫికెట్లు తీసుకెళ్లిపోతే మా పరిస్థితి ఏమిటి..?'అన్నది కాలేజీ నిర్వాహకుల వాదన. ఇక గత్యంతరం లేక సురేష్ తన తల్లి నగలు అమ్మి రూ.60వేలు చెల్లించి, సర్టిఫికెట్లు తీసుకున్నాడు.
ఒక్క సురేష్ మాత్రమే కాదు.. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే కాదు.. రాష్ట్రంలో ‘ఫీజు’ పథకం కింద ఈ ఏడాది వివిధ కోర్సుల్లో ఫైనలియర్ పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థుల పరిస్థితి ఇది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక, పైస్థాయి కోర్సుల్లో చేరలేక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దీనిపై కాలేజీ యాజమాన్యాలనూ పూర్తిగా తప్పుపట్టలేని పరిస్థితి. సంవత్సరకాలంగా ప్రభుత్వం నయాపైసా విడుదల చేయకున్నా, అప్పులు తెచ్చి నడిపిస్తున్నామని యాజమాన్యాల వర్గాలు చెబుతున్నాయి. ఆరు నెలలుగా అనేక కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాల్లేవని, వారు కాలేజీల్లో సహాయ నిరాకరణకు దిగినా.. ఎలాగోలా నెట్టుకొస్తున్నామని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 17 నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ ప్రథమ సంవత్సర పరీక్షలను నిర్వహించబోమని కాలేజీలు తెగేసి చెప్పాయి. డబ్బులు కడితేనే జవాబు పత్రాలు ఇస్తామని జేఎన్టీయూ చెబుతుండగా.. ఫీజులే రాలేదు, అవి వచ్చాకే పరీక్షలు నిర్వహిస్తామని యాజమాన్యాలు అంటున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ జేఎన్టీయూ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌కు లేఖను అందజేశాయి.
తప్పని ఇబ్బందులు..
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యార్థులతో పాటు కాలేజీల యాజమాన్యాలు, బోధన, బోధనేతర సిబ్బంది ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ బీటెక్ పూర్తిచేసిన వారు ఆందోళనలో కూరుకుపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో.. ఈ పథకం కింద బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మరోవైపు అధికారులు ఎంటెక్‌లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించారు. ఈనెల 14తో దీనికి గడువు కూడా ముగుస్తోంది. ఎంటెక్ ప్రవేశపరీక్ష అయిన పీజీఈసెట్‌లో 38,882 మంది అర్హత సాధించగా... అందులో కేవలం 16 వేల మందే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. వీరంతా ఫీజు రీయింబర్స్‌మెంట్ లేనివారు లేదా కాలేజీల్లో డబ్బు కట్టి సర్టిఫికెట్లు తె చ్చుకున్నవారే. మిగతా దాదాపు 23వేల మంది విద్యార్థుల పరిస్థితి గందరగోళమే. ఇటు ఫీజులు చెల్లించలేక, అటు సర్టిఫికెట్లు లేక వెరిఫికేషన్‌కు హాజరుకాలేక వారంతా ఆవేదనలో మునిగిపోయారు. అసలు ఎంటెక్ కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపు రాకుండానే, ఏయే కాలేజీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయన్న స్పష్టత లేకుండానే... ప్రవేశాల క్యాంపు అధికారులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టడం గమనార్హం.
మొన్నటి వరకు దరఖాస్తులే..
2014-15 విద్యా సంవత్సరం గత ఏప్రిల్ నెలాఖరుతోనే ముగిసింది. కానీ దానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం గత నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులే ఇప్పటిదాకా స్వీకరిస్తే.. ఆ ఫీజులు వచ్చేదెప్పుడన్న ప్రశ్న తలెత్తుతోంది. 2014-15కు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కింద 7,47,168 మంది విద్యార్థులకు దాదాపు రూ.2,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఫైనలియర్ పూర్తయిన విద్యార్థులే 3లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. వారికోసం ఎంత ఇవ్వాలన్న లెక్కలు లేవు. కానీ రూ.300కోట్ల వరకు ఇస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. అవి ఏ మూలకు సరిపోవన్నది కాలేజీల వాదన. అసలు ఈ నిధులనైనా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఫైనలియర్ విద్యార్థులందరి ఫీజులను ఎప్పుడు చెల్లిస్తారన్న స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తయ్యాయి. పీజీ, వృత్తి విద్యా ప్రవేశాలు పూర్తికావచ్చాయి. కొంతమంది డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తె చ్చుకుంటే... మరికొంత మంది సర్టిఫికెట్లు తెచ్చులేక పైకోర్సుల్లో చేరలేకపోతున్నారు.
అన్ని కోర్సుల్లోనూ..
- పేద కుటుంబానికి చెందిన రమ్య ఖమ్మంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో 2014-15లో బీఎస్సీ పూర్తి చేసింది. ఇప్పుడు బీఈడీలో చేరాలనుకుంది. కానీ కాలేజీ యాజమాన్యం డిగ్రీ ఫైనలియర్ ఫీజు రూ.10వేలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటోంది. ఈనెల 20వ తేదీ నుంచి బీఈడీలో ప్రవేశాలు ప్రారంభం కాబోతుండడంతో ఆందోళనలో మునిగిపోయింది.
►నల్లగొండ జిల్లాలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసిన శ్రీధర్ ఎంటెక్‌లో చేరాలనుకున్నాడు. కానీ 'ఫీజు' అందక యాజమాన్యం బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయాడు.
► సిద్దిపేటలోని ఓ డిగ్రీ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ పూర్తిచేసిన రాజేశ్‌కు ఫైనలియర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో... పీజీ కౌన్సెలింగ్‌కు హాజరుకాలేక విద్యా సంవత్సరం నష్టపోయాడు.