సర్టిఫికెట్టు.. తాకట్టు! | engineering students suffering to get back their certificates | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్టు.. తాకట్టు!

Published Tue, Nov 14 2017 2:48 AM | Last Updated on Tue, Nov 14 2017 4:28 AM

engineering students suffering to get back their certificates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :

రాహుల్‌..    ఏడాది కిందట మేడ్చల్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరాడు.. ఫస్టియర్‌ కాకుండానే అనారోగ్య సమస్యలతో కాలేజీ మానేశాడు.. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు కాలేజీలోనే ఉండిపోయాయి.. వాటిని ఇవ్వాలని అడిగితే మిగతా మూడేళ్ల ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని కరాఖండీగా చెప్పేసింది యాజమాన్యం!

వెంకటేష్‌..    మొయినాబాద్‌లోని మరో ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాడు.. ప్రథమ సంవత్సరం పూర్తయింది.. తండ్రి అనారోగ్యం కారణంగా కుటుంబ పోషణ భారం అతడిపై పడింది. సెకండియర్‌ కాలేజీకి వెళ్లలేని పరిస్థితి.. యాజమాన్యాన్ని తన సర్టిఫికెట్లు అడిగితే మూడేళ్ల ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పింది.. దీంతో ఆ విద్యార్థి సాంకేతిక విద్యాశాఖకు ఫిర్యాదు చేశాడు.

..కోర్సులు పూర్తయిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదన్న సాకుతో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న యాజమాన్యాలు.. అనివార్య కారణాల వల్ల చదువు మానేసిన విద్యార్థులకు కూడా చుక్కలు చూపుతున్నాయి! ఇంటర్‌ అర్హతతో ఇతర కోర్సులు చదువుకునే అవకాశమే లేకుండా చేస్తున్నాయి. మిగతా సంవత్సరాల ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామంటూ మెలిక పెడుతున్నాయి. కుటుంబ సమస్యలు, డిటెన్షన్, చదవలేకపోవడం వంటి కారణాలతో కాలేజీల్లో చేరుతున్న వారిలో ఏటా 5 వేల నుంచి 6 వేల మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. వీరంతా కాలేజీ నుంచి సర్టిఫికెట్లు వెనక్కి తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కనికరించకపోవడంతో సాంకేతిక విద్యాశాఖకు క్యూ కట్టారు. ఇలా గత పదిహేను రోజుల్లో 47 మంది విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

ఏఐసీటీఈ చెప్పినా..
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం చదువు మానేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను వారికి తిరిగి ఇచ్చేయాలి. ఏ కారణంతోనూ నిరాకరించడానికి వీల్లేదు. మిగతా సంవత్సరాల ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామన్న మెలిక పెట్టరాదు. ఈ విషయాన్ని ఏఐసీటీఈ 2017–18 ఇంజనీరింగ్‌ కాలేజీల అప్రూవల్‌ ప్రాసెస్‌లో స్పష్టం చేసింది. ఇబ్బందులతో చదువు మానేస్తున్న వారి సర్టిఫికెట్లు ఆపి మరింత ఇబ్బందులు పెట్టవద్దని స్పష్టం చేసింది. అయినా యాజమాన్యాల తీరు మారడం లేదు. వీరేకాదు కోర్సు పూర్తయిన వారికి ఈ తంటాలు తప్పడం లేదు. దీంతో కొందరైతే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఎంపికైనా సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉద్యోగాల అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద నిధుల విడుదలలో ఆలస్యం అవుతుండటంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి.

హైకోర్టుది అదే మాట..
విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిరాకరించడం సరికాదని, ఎట్టి పరిస్థితుల్లో వారికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని ఇటీవల హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అటు సాంకేతిక విద్యాశాఖ సైతం కొన్ని కాలేజీలకు లేఖలు రాసింది. అయితే సర్టిఫికెట్లు ఇచ్చేయాలని చెప్పే అధికారం సాంకేతిక విద్యాశాఖకు లేదంటూ కొన్ని యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థులు మధ్యలో వెళ్లిపోతే తాము మిగతా సంవత్సరాల ఫీజును నష్టపోతామని వాదించాయి. అయితే హైకోర్టు కూడా విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపడానికి వీల్లేదని స్పష్టం చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement