
రాణాప్రతాప్
కారేపల్లి: కోవిడ్ బీమా సొమ్ము స్వాహా చేసేందుకు ఫోర్జరీ సర్టిఫికెట్లు, నకిలీ చికిత్స బిల్లులు సమర్పించిన కేటుగాళ్ల బండారం బయటపడింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బ తండా, మేకలతండా గ్రామాల్లోని 800 మంది కి బీమా చేయించాక సుమారు 500 మందికి కరోనా సోకినట్లు సమీప మహబూబాబాద్ జిల్లా గార్ల సీహెచ్‌సీ నుంచి తీసుకున్నట్లు ఉన్న సర్టిఫికెట్లు సమర్పించగా, 90 మందికి బీమా క్లెయిమ్ అయిన విషయం వెలుగుచూసింది.
ఈ విషయమై ‘కోవిడ్ బీమాలో కేటుగాళ్లు’ శీర్షికన ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ఎస్‌బీఐ లైఫ్ కోవిడ్ రక్షక్ బీమా పథకంలో వందలమంది పేర్లను ఆన్ లైన్ చేసిన స్థానిక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడిని మంగళవారం కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. కాగా, ఈ విషయమై బీమా సంస్థ ప్రతినిధు లుకానీ, దళారుల చేతిలో మోసపోయినవారు కానీ ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కుశకుమార్ తెలిపారు.
గార్ల సీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ రాణాప్రతాప్ ను వివరణ కోరగా, తమ సీహెచ్‌సీ నుంచి జారీ అయినట్లుగా చెబుతున్న సర్టిఫికెట్లపై ఆస్పత్రి నకిలీ స్టాంప్, ఫోర్జరీ సంతకం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 30కిపైగా సర్టిఫికె ట్లతో బీమా సంస్థ ప్రతినిధులు సంప్రదించగా, తన సంతకం ఫోర్జరీ అయినట్లు చెప్పానని వివరించారు. పత్రికలకథనాలతో పదిమంది ముఠాసభ్యులు పరారయ్యారు.