1 నుంచి ‘సచివాలయాల’ వద్ద ప్రత్యేక క్యాంపులు  | Special camps for four weeks at secretariats | Sakshi
Sakshi News home page

1 నుంచి ‘సచివాలయాల’ వద్ద ప్రత్యేక క్యాంపులు 

Published Wed, Jun 21 2023 5:07 AM | Last Updated on Wed, Jun 21 2023 5:07 AM

Special camps for four weeks at secretariats - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా అన్ని రకాల ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ మంగళవారం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. తహసీల్దార్, ఎంపీడీవోలతో సహా వివిధ మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జూలై 1 నుంచి సచివాలయాల వారీగా ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు.

వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఈ నెల 24 నుంచే ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను కూడా సేకరిస్తారు. క్యాంపుల నిర్వహణ సమయంలో వినతుల స్వీకరణ, పరిష్కారం కోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టు డెస్‌్కలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఆయా డెస్‌్కల్లో మండల స్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలను కూడా పొందుపరిచారు.  

గ్రామ సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపుల నిర్వహణ కోసం మండలాల వారీగా ఎంపీడీవో, తహసీల్దార్‌ల ఆధ్వర్యంలో రెండు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి బృందంలో ముగ్గురేసి మండల స్థాయి అధికారులు ఉంటారు. ఒక మండల పరిధిలో 24 కంటే ఎక్కువగా సచివాలయాలు ఉంటే అవసరమైన పక్షంలో మూడో బృందాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటును స్థానిక అధికారులకే అప్పగించారు.  
   అత్యధిక వార్డు సచివాలయాలు ఉండే నగరాలు, పట్టణాల్లో దగ్గరగా ఉండే సచివాలయాలను క్లస్టర్‌గా వర్గీకరిస్తారు. ఆ క్లస్టర్ల వారీగా క్యాంపులు నిర్వహిస్తారు. అయితే, క్లస్టర్‌ పరిధిని గరిష్టంగా ఐదు వార్డు సచివాలయాలకే పరిమితం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  
 క్యాంపుల పర్యవేక్షణకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్లు            నియమిస్తారు.  
    గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామ సచివాలయాల భవనాల్లోనే ఈ క్యాంపులు నిర్వహించాలని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో సచివాలయం ఉంటే ఇతర ప్రభుత్వ భవనాల్లో క్యాంపులు నిర్వహిస్తారు. 
    ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందస్తుగా అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది, వలంటీర్లకు ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని      సూచించారు.  సచివాలయాల వద్ద నిర్వహించే క్యాంపుల్లో ఈ 11 సర్వీసులకు ఎలాంటి సర్విసు చార్జీలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. అయితే, మ్యుటేషన్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీకి దరఖాస్తుదారులు చెల్లించాల్సిన స్టాట్యుటరీ చార్జీలను మాత్రం వసూలు చేస్తారు.

సర్వీసు చార్జీలు లేకుండా అందజేసే సేవలివే.. 
 ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)  
♦  ఆదాయ ధ్రువీకరణ పత్రం 
    డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌
♦  మరణ ధ్రువీకరణ పత్రం 
    మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌ (భూకొనుగోలు ­అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు), మ్యుటేషన్‌ ఫర్‌ కరక్షన్స్‌ (ఆన్‌లైన్‌లో భూవివరాల నమోదులో మార్పులు చేర్పులు) 
    వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు) 
   ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు  
    ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌  
    కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)  
    కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన   
    ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement