న్యూఢిల్లీ: వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోది చేసిన సూచనను రెండేళ్ల తర్వాత రైల్వే శాఖ ఆచరణలో పెట్టింది. రైల్వే రాయితీ ఫారాలలో వికలాంగ్ అని ఉన్నచోట దివ్యాంగ్‌గా నామావళిని మార్పు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అందజేసే రాయితీ(కన్సెషన్) దరఖాస్తులో ‘బ్లైండ్’ అని ఉన్నచోట దృష్టి బలహీనులుగా, చెవిటి మూగ అని ఉన్నచోట వినలేని, మాట్లాడలేని బలహీనులుగా, ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్ అని ఉన్నచోట దివ్యాంగ్‌జన్ అని మార్పు చేశారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1నుంచి అమలులోకి వస్తాయి. ఈ రాయితీ ధ్రువపత్రాల ప్రొఫార్మలో ఈ విధంగా మార్పులు చేయాలని ఆయా విభాగాలకు రైల్వే శాఖ సూచించింది.
కాగా, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్‌లు, విద్యార్థులు, రక్షణ సిబ్బంది తదితరులకు భారతీయ రైల్వే శాఖ రూ.1,600 కోట్ల విలువ చేసే 53 రకాల రాయితీలు ఇస్తోంది. మాట్లాడలేని, వినలేని దివ్యాంగులకు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌ల్లో 50 శాతం, దృష్టి బలహీనులకు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసి చైర్‌కార్, ఏసీ త్రీ ట్రైర్‌లో 75 శాతం, ఏసీ టూ టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్‌ల్లో 50 శాతం రాయితీ ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment