న్యూఢిల్లీ : ప్రయాణాల్లో వివిధ కేటగిరీలకు అందించే రాయితీలపై రైల్వే మంత్రి కీలక ప్రకటన చేశారు. రాయితీలను ఎప్పుడు పునరుద్ధరించాలనే అంశంపై ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైల్వే టిక్కెట్లపై రాయితీలు ఇవ్వబోమన్నారు. ప్రస్తుతం ఉన్నట్టుగానే ఫుల్ ఛార్జీ వసూలు చేస్తామన్నారు.
గతేడాది రైల్వేశాఖ తాత్కాలికంగా రద్దు చేసిన ప్రయాణ రాయితీలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారంటూ శుక్రవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రాయితీలు ఇప్పుడే పునరుద్ధరించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
కరోనా సంక్షోభం కారణంగా 2020 మార్చిలో రైల్వేశాఖ దేశవ్యాప్తంగా రైళ్లను రద్దు చేసింది. ఆ తర్వాత క్రమంగా రైళ్లను ప్రారంభించింది. అయితే వాటిని సాధారణ రైళ్లుగా కాకుండా ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తోంది. దీంతో ఈ రైళ్లలో రాయితీలు వర్తించడం లేదు. రైల్వే శాఖ ఆర్మీ, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, జర్నలిస్టులు ఇలా మొత్తం 51 కేటగిరీలలో రాయితీలు అందిస్తోంది. ప్రస్తుతం ఇందులో దివ్యాంగులు, స్టూడెంట్స్, రోగులకే రాయితీలు వర్తిస్తున్నాయి. మిగిలిన కేటగిరీలకు ఫుల్ ఛార్జీని వసూలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment