
తేడా వస్తే ఊరుకోం!
జిల్లాలో ఒక్క తప్పుడు పత్రం వచ్చినా తహసీల్దార్, కలెక్టర్ కూడా బాధ్యులే
స్థానికత, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీపై సీఎం కేసీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: స్థానికత, కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో ఏమాత్రం తేడా వచ్చినా సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఒక జిల్లాలో ఒక్క తప్పుడు ధ్రువపత్రం వచ్చినా సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కూడా బాధ్యులేనని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని... అలాగని ఏదైనా తేడా వస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సహాయం అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో హెచ్‌ఐసీసీలో జరిగిన ‘పకడ్బందీ సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’ సదస్సులో సీఎం కేసీఆర్ అధికారులకు మార్గ నిర్దేశం చేశారు.
‘‘ఇప్పటికే పలు రకాల సర్వేలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఈ ఇంటింటి సర్వే ఎందుకని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సర్వే చేపట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో చేసిన సర్వేలన్నీ తప్పులతడకలు. కొన్నయితే వందశాతం తప్పు. జనాభా లెక్కలు, బహుళార్థ ప్రయోజన ఇంటింటి సర్వే, ‘సెర్ప్’, డీఆర్‌డీఏ సర్వే ఇలా ఏది చూసినా.. ఒకదానితో మరోదానికి పొంతన లేదు. గణాంకాలు ఒకేలా లేవు. ఆఖరుకు నెలనెలా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నా... కచ్చితంగా ఎంతమంది ఉద్యోగులున్నారన్న వివరాలు లేకపోవడమనేది తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు చేసే సర్వే వివరాలు మండల అధికారుల నుంచి ముఖ్యమంత్రి వద్ద ఉండే కంప్యూటర్లో వరకూ ఒకే విధంగా ఉంటాయి.
మారుమూల గ్రామంలో ఒక రైతు గురించి తెలుసుకోవాలంటే.. ఒక్క బటన్‌తో వివరాలు రావాలి. తొందరేమీ లేదు.. మీరు సమయం తీసుకుని చెప్పండి.. ఈ సర్వే ఒకేరోజు రాష్ట్రం మొత్తం జరగాలి. అందుకు రెవెన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండాలి. ఊహలు, కలల్లో జీవించడం వద్దు. వాస్తవ పరిస్థితుల్లో జీవిద్దాం. భేషజాలు లేకుండా, చిత్తశుద్ధితో పనిచేద్దాం..’’ అని అధికారులకు కేసీఆర్ సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పాత బకాయిలు రూ. 1,300 కోట్లు ఉన్నాయని, ఈ ఏడాదికి మూడు వేల కోట్లు కావాలంటున్నారని... ఇంత విచ్చలవిడిగా ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం మెడపై కత్తిపెట్టి బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారని, అయినా ప్రభుత్వం భయపడబోదని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘ఇతర ప్రాంతాల విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు ఇవ్వబోమని, స్థానికతను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చిందని చెప్పారు. ఆయన చెప్పిన ప్రధాన అంశాలు...
- రాష్ట్ర ప్రజలకు సంబంధించి స్థితిగతులు తెలియకుండా ప్రణాళికలు రూపొందిస్తే వ్యర్థమవుతాయి. పకడ్బందీ డాటాబేస్ ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు దళారీలపాలు కాకుండా అర్హులకే అందుతాయి.
- రేషన్‌కార్డులు, ఇళ్లు, పెన్షన్ల నిధులను దొంగలు దోచుకున్నారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 84 లక్షల కుటుంబాలు ఉంటే.. ప్రస్తుతం 86 లక్షల కుటుంబాలు అంటున్నాయి. రేషన్‌కార్డులు మాత్రం 1.07 కోట్లు ఉన్నాయి. మిగతా 22 లక్షల కార్డులు ఎక్కడ ఉన్నాయి?
- తెల్లరేషన్‌కార్డులతో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది. అన్నింటికీ తెల్లరేషన్‌కార్డులతో అనుసంధానం పొరపాటు చర్య.
- రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ పథకాల కింద 52 లక్షల ఇళ్లు కట్టారు. మళ్లీ కొత్తగా ఇళ్ల నిర్మాణం అవసరమా..? గ్రామాలకు వెళితే ప్రజలు ఇళ్లు కావాలంటున్నారు. మరి కట్టిన ఇళ్లు ఏమయ్యాయి?
- ప్రజాధనానికి ప్రభుత్వం ధర్మకర్త మాత్రమే. నిధులు దుర్వినియోగం కానీయొద్దు. ఇష్టానుసారం దానం చేయొద్దు.