‘ఉపకారం’ కట్!
- సర్టిఫికెట్లు ఇవ్వని వారికి సమస్యలు
- ముందు జాగ్రత్త లేని విద్యార్థులు
- సంక్షేమశాఖల చుట్టూ ప్రదక్షిణలు
- ఆందోళన వద్దంటున్న అధికారులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: పలుకోర్సులలో అడ్మిషన్ల కోసం జరిగిన కౌన్సెలింగ్‌లో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయని విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజుల వాపస్ కోసం అవస్థలు పడుతున్నారు. 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించి సర్టిఫికెట్లు అందజేయని వారికి ఉపకారవేతనాలు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది.
విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరయిన తర్వాతే కళాశాలలకు ఫీజులు విడుదల చేస్తారు. కాని, వీరికి ఇప్పటివరకు ఉపకారవేతనాలు మంజూరు కాకపోవడంతో కళాశాలలకు ఫీజులు కూడా విడుదల చేయలేదు. దీంతో ఆ విద్యార్థులను యాజమాన్యాలు ఫీజులు కట్టాలని ఆదేశించడంతో విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. వీరు రోజూ అధికసంఖ్యలో ఎంవీపీ కాలనీలోని బీసీ సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, డిప్లమో కోర్సులలో ప్రవేశాలకు హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలలో కౌన్సెలింగ్ జరుగుతుంది. కాని, ఈ ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రెవెన్యూశాఖ సిబ్బంది కూడా సమ్మె చేయడం వల్ల చాలా మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ సమయం నాటికి సర్టిఫికెట్లు అందలేదు. బీసీ, ఎస్సీ, ఈబీసీ విద్యార్థులకు సీట్లు మాత్రం కేటాయించారు.
సర్టిఫికెట్లు వచ్చాక పలువురు విద్యార్థులు హైదరాబాద్‌లోని కౌన్సెలింగ్ కన్వీనర్ కార్యాలాయానికి వెళ్లి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా, అక్కడి సిబ్బంది ఆన్‌లైన్‌లో వివరాలు ఫీడ్ చేయకుండా జెరాక్స్ కాపీలపై ఉపకారవేతనం, ఫీజులకు సదరు విద్యార్థి అర్హుడే నని పెన్నుతో రాసి వెనక్కు పంపించేశారని కొందరు విద్యార్థులు న్యూస్‌లైన్‌కు తెలిపారు. తర్వాత విశాఖలోని సంక్షేమ శాఖల కార్యాలయాలకు వెళితే సరిపోతుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు.
అయితే విద్యార్థులకు ముందుచూపు లేనందునే ఈ పరిస్థితి దాపురిస్తోందని అధికారులు అంటున్నారు.ఏటా కౌన్సెలింగ్‌కు ముందుగానే సర్టిఫికెట్లు సిద్ధం చేసుకునే విషయమై విద్యార్థులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలియజేస్తున్నార. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమశాఖలో 69 మంది విద్యార్థులు, సాంఘిక సంక్షేమ శాఖలో 8 మంది విద్యార్థులు ఫీజులు, ఉపకారవేతనాల కోసం ఫిర్యాదు చేశారు.అక్కడి అధికారులు ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఉన్నత కార్యాలయాలకు మెయిల్‌ద్వారా సమాచారం పంపించారు.
అయితే ఇప్పటివరకు నిధులు మాత్రం విడుదల కాలేదు. ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ డి.శ్రీనివాసన్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా, తమశాఖ కమిషనర్ ఈ విషయమై ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక చర్యలు చేపడతామని, విద్యార్థులెవరూ ఉపకారవేతనాలు, ఫీజుల కోసం ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు.