తప్పు.. ఆ తల్లిదండ్రులదే..
* వారి అత్యాశకు పిల్లలే బాధితులు
* పిల్లల చదువులపై తల్లిదండ్రులకు హైకోర్టు చురకలు
సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువుల విషయంలో అత్యాశలకు పోతున్న తల్లిదండ్రులకు హైకోర్టు చురకలంటించింది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి తప్పుడు స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు కారణమైన ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులను మందలించింది. ఆ ఇద్దరు విద్యార్థినులపట్ల హైకోర్టు మానవతాదృక్పథంతో వ్యవహరించింది. వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయాలని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే..: రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు గతేడాది ఏపీలో జరిగిన ఎంసెట్‌కు హాజరై ఉత్తీర్ణత సాధించారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశాల నిమిత్తం ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో స్థానికతకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణపత్రాలు సమర్పించారు. దీంతో ఎన్టీఆర్ వర్సిటీ వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆ విద్యార్థినులు ఈ ఏడాది కూడా ఏపీ ఎంసెట్ పరీక్ష రాసి ఉత్తమర్యాంకులు సాధించారు. అయితే ఒరిజి నల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు వర్సిటీ నిరాకరించడంతో ఆ విద్యార్థినులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
వారి తల్లిదండ్రులే నిజమైన నేరస్థులు..
‘పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు వాస్తవమైతే, నిజానికి నేరస్థులు ఆ విద్యార్థులు ఎంత మాత్రం కారు. వారి తల్లిదండ్రులే నిజమైన నేరస్తులు. తల్లిదండ్రుల ఆలోచనలు.. వైద్యులుగా ఆస్పత్రుల్లో ఉండాల్సిన తమ పిల్లలను పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగేలా చేశాయి. విద్యార్థినులను సస్పెండ్ చేయడం ద్వారా వర్సిటీ ఇప్పటికే వారిని శిక్షించింది. ఉత్తమ ర్యాంకులు సాధించినవారికి ఈ ఏడాది కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రవేశాలు నిరాకరించడం రెండోసారి శిక్షించడమే అవుతుంది. వారి గత ప్రవర్తనకు మొత్తం జీవితాలే బలికావడం అన్యాయమే అవుతుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.