- డీఎడ్ కాలేజీలపై రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని అనుమతులు ఉన్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈ ఎల్‌ఈడీ) కాలేజీల్లోనే ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు అందజేసిన కాలేజీలనే ఈనెల 7 నుంచి నిర్వహించే కౌన్సెలింగ్‌కు అనుమతించనున్నారు. పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో 258 డీఈఎల్‌ఈడీ కాలేజీలు ఉండగా వాటిల్లో ఇప్పటివరకు 78 కాలేజీలు మాత్రమే ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు అందజేశాయి. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీ నాటికి సర్టిఫికెట్లను తీసుకువచ్చిన కాలేజీలను జాబితాలో చేర్చుతామని విద్యా శాఖ ఇప్పటికే ప్రకటించింది. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు తీసుకురాని కాలేజీలు, ఆ తరువాత తీసుకువస్తే రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించే అవకా శం ఉంది. మరోవైపు మైనారిటీ కాలేజీలు సొం తం గా ప్రవేశాలు(ఎస్‌డబ్ల్యూ-2) చేపట్టాలంటే, ఆ కాలేజీలు అన్నీ కన్సార్షియంగా ఏర్పడితే ఓ కన్వీనర్‌ను నియమిస్తారు.
ఆ కన్వీనర్ నేతృత్వంలో ప్రవేశాలు చేపడతారు. అయితే రాష్ట్రంలోని అన్ని మైనారిటీ కాలేజీలు కలసి రానందున, వాటిని సాధారణ కౌన్సెలింగ్ జాబితాలోనే చేర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 1 ప్రకారం మైనారిటీ కాలేజీగా గుర్తింపు రావాలంటే రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సర్టిఫికెట్ ఇవ్వాలి. కాని రాష్ట్రం లోని నాలుగైదు కాలేజీలు మినహా మిగతా కాలేజీలన్నీ జాతీయ మైనారిటీ కమిషన్ నుంచి మైనారిటీ హోదా సర్టిఫికెట్లు తెచ్చి పెట్టాయి. అయితే జాతీయ మైనారిటీ కమిషన్ ఇచ్చిన సర్టిఫికెట్లను దాఖలు చేసిన కాలేజీలను మైనారిటీ కాలేజీలుగా గుర్తించరాదని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.