పంట ఏదైనా.. మూడింతల ఆదాయం  | GAP certification in AP for the first time in the country | Sakshi
Sakshi News home page

పంట ఏదైనా.. మూడింతల ఆదాయం 

Published Sun, Dec 17 2023 5:10 AM | Last Updated on Sun, Dec 17 2023 2:53 PM

GAP certification in AP for the first time in the country - Sakshi

సాక్షి, అమరావతి: అన్నదాత కల ఫలిస్తోంది. నచ్చిన చోట.. నచ్చిన వారికి.. నచ్చిన ధరకు పంటల్ని అమ్ముకునే వెసులుబాటు కలుగుతోంది. పండించిన పంటకు ప్రీమియం ధర దక్కుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జారీ చేస్తున్న గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌ (గ్యాప్‌) సర్టిఫికేషన్‌తో రైతుల తలరాత మారుతోంది. సర్టిఫికెట్స్‌ జారీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. 

ఇన్నాళ్లూ ధ్రువీకరించే వ్యవస్థ లేక 
సాగు విధానాలను బట్టి పంట ఉత్పత్తులను  ధ్రువీకరించే వ్యవస్థ లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా మంచి ధర ఉన్నప్పటికీ అత్యధిక వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను దేశీయంగానే  విక్రయించు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఏపీ స్టేట్‌ సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్‌ సేంద్రియ సర్టిఫికేషన్‌ అథారిటీ (ఏపీ ఎస్‌వోపీసీఏ)ని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు  సాధిస్తున్న రైతులకు గ్యాప్‌ సర్టిఫికేషన్‌  జారీ చేయాలని, రెండో దశలో పూర్తిగా సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు  ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ జారీ చేయాలని  సంకల్పించింది.
 
క్యూసీఐ గుర్తింపుతో.. 
ఇండో గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ కోసం ఏపీ ఎస్‌వోపీసీఏకు ఇటీవలే క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ) అక్రిడిటేషన్‌ జారీ చేసింది. దీంతో దేశంలోనే గ్యాప్‌ సర్టిఫికేషన్‌ పొందిన తొలి రాష్ట్రంగా  ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. మలిదశలో ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కోసం ఎపెడా (ప్రొసెస్‌ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ) నుంచి అక్రిడిటేషన్‌ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సర్టిఫికేషన్‌ జారీపై ఎంపిక చేసిన అధికారులు, రైతులకు ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో),భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) సౌజన్యంతో వివిధ స్థాయిల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. సర్టిఫికేషన్‌ పొందేందుకు పంటల సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్‌ అడ్వైజర్లుగా.. వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్‌ ఆఫీసర్లుగా.. తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్‌ డిప్లమో చేసిన వార్ని ఇంటర్నెల్‌ ఇన్‌స్పెక్టర్స్‌గా నియమించారు. 

నంద్యాల జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఈ రైతు పేరు కురాకుల ఓబులేసు. రెండెకరాల్లో కొర్రలు సాగు చేశాడు. గ్యాప్‌ సర్టిఫికేషన్‌ కోసం గుర్తించిన క్లస్టర్‌లో ఆయన పొలం కూడా ఉంది. పొలం బడిలో చెప్పినట్టుగా తగిన మోతాదులో ఎరువులు వినియోగించాడు. ఒక్కసారి మాత్రమే పురుగుల మందు పిచికారీ చేశాడు. మొత్తంగా ఎకరాకు రూ.4,500 పెట్టుబడి అయ్యింది. 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చాక పురుగు మందుల అవశేషాల పరీక్ష చేయించాడు.

ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేవని ల్యాబ్‌లో నిర్ధారించి సర్టిఫికెట్‌ ఇచ్చారు. కొర్రలు కనీస మద్దతు ధర రూ.2.500 ఉండగా.. ఈ సర్టిఫికేషన్‌ వల్ల క్వింటా రూ.7వేలకు అమ్ముకోగలిగాడు. పెట్టుబడి రూ.9 వేలు పోగా.. నికరంగా రూ.47 వేల ఆదాయం వచ్చింది. ఓబులేసు మాట్లాడుతూ.. ‘గతంలో పంటల్ని కనీస మద్దతు ధరకు కూడా కొనేవారు కాదు. ఈ ఏడాది గ్యాప్‌ సర్టిఫికేషన్‌ వల్ల మంచి ఆదాయం వచ్చింది’ అంటూ 
ఆనందంగా చెప్పాడు.

ఎమ్మెస్పీ కంటే రెండింతల ఆదాయం.. 
నంద్యాల జిల్లా డోన్‌ మండలం ఎర్రగుంట్లలో ఎంపిక చేసిన రెండు క్లస్టర్స్‌లో 49 మంది రైతులు 63 ఎకరాల్లో కొర్రలు సాగు చేశారు. సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖరీఫ్‌లో నెలకొన్న బెట్ట పరిస్థితుల కారణంగా ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున 252 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతంలో ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5 వేల పెట్టు­బడి అయ్యింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మె­స్పీ క్వింటాకు రూ.2,500 కాగా.. రైతులు క్వింటాకు రూ.2,900 నుంచి రూ.4,500 చొప్పున అదనంగా లబ్ధి పొందగలిగారు.

33 మంది రైతులు క్వింటా రూ.5,400 చొప్పున 161 క్వింటాళ్లను, ఏడుగురు రైతులు క్వింటా రూ.6 వేల చొప్పున 43 క్వింటాళ్లు, ఐదుగురు రైతులు క్వింటా రూ.6,300 చొప్పున 28 క్వింటాళ్లు, ఓ రైతు క్వింటా రూ.7 వేల చొప్పున 6 క్వింటాళ్లను విక్రయించారు. ఇలా ఎమ్మెస్పీ కంటే అదనంగా రూ.7.51 లక్షల ఆదాయాన్ని పొందారు. సర్టిఫికేషన్‌తో వ్యాపారులు సైతం పోటీ­పడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయ­డంతో కోత కొచ్చిన కొర్రలను రైతులు ఎమ్మె­స్పీకి రెండింతల ధరకు అమ్ముకోగలిగారు.  

0.1 శాతం కంటే తక్కువ అవశేషాలు 
నాలుగేళ్లుగా వైఎస్సార్‌ పొలం బడులను ప్రామాణికంగా తీసుకుని గడచిన ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాల్లో ‘గ్యాప్‌ క్లస్టర్స్‌’ను ఎంపిక చేశారు. ఈ క్లస్టర్‌లో గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ కోసం 1,487.47 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ, మిరప, అరటి, పసుపు, కూరగాయ పంటలను గుర్తించారు. వ్యవసాయ పంటలు సాగు చేసే 622 మంది రైతులతో 20, ఉద్యాన పంటలు సాగు చేసే 190 మందితో 13 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ కోసం ఏపీ ఎస్‌ఓపీసీఏ వద్ద రిజిస్ట్రేషన్  చేయించారు.

గడచిన ఖరీఫ్‌ సీజన్‌ నుంచే గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీకి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు వినియోగించేలా అవగాహన కల్పించారు. వివిధ దశల్లో రైతు క్షేత్రాల నుంచి శాంపిల్స్‌ తీసి పరీక్షించారు. పురుగు మందుల అవశేషాల స్థాయి 0.1శాతం కంటే తక్కువగా ఉన్నా­యని గుర్తించారు.

99.99 శాతం ఆర్గానిక్‌ ఉత్ప­త్తులుగా గుర్తిస్తూ వారికి సర్టిఫికేషన్‌ జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మలి దశలో రైతులను మార్కెటింగ్‌ ఏజెన్సీలు, ఎగుమతిదారులతో అనుసంధానం చేస్తారు. ఈ సర్టిఫికేషన్స్‌తో వారు పండించే ఉత్పత్తులకు మార్కెట్‌లో ప్రీమియం ధర లభించడంతోపాటు అంతర్జాతీయంగా ఎగుమతి  చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.  

సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా సర్టిఫికేషన్‌ జారీ 
గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ కోసం ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీకి క్యూసీఐ అక్రిడిటేషన్‌ జారీ చేసింది. సర్టిఫికేషన్‌తో మన రైతులు అంతర్జాతీయంగా పోటీపడే అవకాశం ఏర్పడింది. గడచిన ఖరీఫ్‌లో 1,487 ఎకరాల్లో 812 మంది రైతులకు గ్యాప్‌ సర్టిఫికేషన్‌ కోసం రిజిస్ట్రేషన్  చేయించుకున్నారు. సర్టిఫికేషన్‌ జారీ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన అధికారికంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.  – త్రివిక్రమ్‌రెడ్డి, ఎండీ, ఏపీ సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement