ఇబ్బంది లేకుండా ‘ఈ–క్రాపింగ్‌’ | CM YS Jagan Mandate authorities to give high priority to e-cropping | Sakshi
Sakshi News home page

ఇబ్బంది లేకుండా ‘ఈ–క్రాపింగ్‌’

Published Wed, Jul 28 2021 3:39 AM | Last Updated on Wed, Jul 28 2021 3:39 AM

CM YS Jagan Mandate authorities to give high priority to e-cropping - Sakshi

వ్యవసాయం, ఖరీఫ్‌ సన్నద్ధతపై ‘స్పందన’లో జిల్లాల అధికారులతో మాట్లాడుతున్న సీఎం జగన్‌

దేవుడు చాలా గొప్పవాడు.. వర్షాలు బాగా కురిశాయి 
శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ నుంచే విద్యుత్‌ ఉత్పత్తిని స్టార్ట్‌ చేశారు (తెలంగాణ ప్రభుత్వం).796 అడుగుల నుంచే నీటిని విడుదల చేయడం మొదలుపెట్టారు. దేవుడు చాలా గొప్పవాడు.. వర్షాలు బాగా కురిశాయి. నీళ్లు బాగా వస్తున్నాయి. శ్రీశైలం నిండుతోంది. వీటితోపాటు వర్షాలవల్లే  రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో జలాశయాలు నిండే పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు చాలా గొప్పవాడు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో అదనపు వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో 77 శాతం, కడప జిల్లాలో 93.6 శాతం, అనంతపురంలో 82.4శాతం, కర్నూలులో 42.9 శాతం, ప్రకాశం జిల్లాలో 25 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం అదనపు వర్షపాతం నమోదైంది.     – సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: పంటల నమోదుకు సంబంధించి ఈ–క్రాపింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రైతులను డాక్యుమెంట్ల పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఈ– క్రాపింగ్‌ చేయాలన్నారు. భౌతిక, డిజిటల్‌ అకనాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వాలని, ఈ–క్రాపింగ్‌ జరగని రైతు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆర్బీకేల్లో ఈ–క్రాపింగ్‌పై కలెక్టర్లు, జేసీలు పది శాతం తనిఖీ చేయాలని సూచించారు. జేడీఏ, డీడీఏ 20 శాతం తనిఖీలు చేయాలని, వ్యవసాయ, ఉద్యాన అధికారులు 30 శాతం తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిరోధించేందుకు తరచూ దుకాణాలపై దాడులు నిర్వహించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ఆదేశించారు. వ్యవసాయ సలహా మండలి సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని, కలెక్టర్లు వీటిని పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయం, ఖరీఫ్‌ సన్నద్ధత తదితరాలపై ముఖ్యమంత్రి జగన్‌ ‘స్పందన’ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు.

ఖరీఫ్‌ సన్నద్ధత
మంచి వర్షాల వల్ల ఖరీఫ్‌ విస్తీర్ణం పెరుగుతోంది. సాధారణ విస్తీర్ణం 92.26 లక్షల ఎకరాలు అయితే ఇప్పటికే 27.46 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మరింత వేగంగా ఈ–క్రాపింగ్‌ చేపట్టాలి. భౌతికంగా, డిజిటల్‌ రశీదు ఉండాలి. దీనిపై రైతు సంతకం, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సంతకం ఉండాలి. డాక్యుమెంట్లు కావాలని క్షేత్రస్థాయి సిబ్బంది బలవంతం చేయవద్దు. పంట వేసిన ప్రతిచోటా ఇ–క్రాపింగ్‌ చేయాలి. ఒక పొలంలో ఏ పంట ఏశారు? ఎవరు వేశారు? ఎన్ని ఎకరాలు వేశారు? అన్నది ఇ–క్రాపింగ్‌లో నమోదు చేయాలి. పంటల బీమా చేయాలన్నా, సున్నా వడ్డీ ఇవ్వాలన్నా.. పంటల కొనుగోలు చేయాలన్నా.. ఇలా అన్ని రకాల అంశాల్లో ఇ– క్రాపింగ్‌ కీలకం. రైతుల్లో అవగాహన కల్పించి.. ఇ–క్రాపింగ్‌పై దృష్టిపెట్టాలి.

వ్యవసాయ సలహామండలి సమావేశాలు
పంటల ప్రణాళికను అమలు చేయడానికి వ్యవసాయ సలహామండలి సమావేశాలు దోహదం చేస్తాయి. మార్కెట్లో డిమాండు ఉన్న పంటలు సాగు చేయాలి. ఏ పంట వేయాలి, ఏ రకం వేయాలి, ఏ పంట వేయకూడదు అనేది రైతులకు చెప్పాలి. బోర్ల కింద వరి పంట సాగు లాభదాయకం కాదు. ఇవన్నీ రైతులకు చెప్పాలి. వరితోపాటు అదే స్థాయిలో ఆదాయాలు వచ్చే మార్గాలను రైతులకు చూపించాలి. ఆర్బీకేల స్థాయిలో మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం మండలస్థాయిలో, మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహామండలి సమావేశాలు జరగాలి. 

రైతు బాగుంటేనే అంతా బాగుంటుంది
రైతు బాగుంటేనే అంతా బాగుంటుంది. 62 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. రైతుల విషయంలో అన్ని రకాలుగా మనం సహాయకారిగా ఉండాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉండాలి. మొత్తం 15.4 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి 20.20 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి. నాణ్యతను కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి. కలెక్టర్లు, ఎస్పీలు వారానికోసారి కూర్చుని ప్రజా సమస్యలపై చర్చించాలి. 

ఆర్బీకేల వద్దే బ్యాంకింగ్‌ సేవలు
ఆర్బీకేల వరకూ బ్యాంకింగ్‌ సేవలు అందాలి. బ్యాంకుల చుట్టూ రైతులు తిరగడం కాదు, ఆర్బీకేల వద్దే వారికి బ్యాంకింగ్‌ సేవలు అందాలి. కౌలు రైతులకూ రుణాలు అందించాలి. 

సచివాలయాలు, ఆర్బీకేలు.. ఎస్‌ఓపీ
గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేల పరిశీలనకు వెళ్లినప్పుడు కచ్చితంగా ఎస్‌ఓపీ పాటిస్తున్నారా?లేదా? చూడాలి. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విజ్ఞప్తులను స్వీకరించాలి. ఎస్‌ఓపీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. రోజుకు రెండు దఫాలుగా హాజరు నమోదు కావాలి. 

ధాన్యం బకాయిలు విడుదల
మొత్తం ధాన్యం బకాయిలను విడుదల చేస్తున్నాం. మొత్తం రూ.3,300 కోట్లుకు గాను రూ.1800 కోట్లు పది రోజుల క్రితమే చెల్లించాం. మిగిలిన బకాయిలను ఇవాళ విడుదల చేస్తున్నాం. రైతుల చేతుల్లోకి డబ్బులు వచ్చి ఖరీఫ్‌కు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నాం. గత రెండేళ్లలో సగటున 83 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. అంతకు ముందు ఐదేళ్లలో రాష్ట్రంలో సగటున ఏటా కొనుగోలు చేసింది కేవలం 55 నుంచి 57 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే.

వరద లెక్కలు సరి చేసుకోవాలి..
జూలై 28న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించినందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ధవళేశ్వరం వద్ద 5 లక్షల క్యూసెక్కులకుపైగా నీళ్లు కిందకు వెళ్తున్నాయి. పోలవరం కాఫర్‌డ్యాం నిర్మాణం పూర్తైన నేపథ్యంలో వరదనీరు తక్కువగా ఉన్నప్పటికీ ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి. లెక్కలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో 10 లక్షల క్యూసెక్కులకు ముంపు ఉంటే ఇప్పుడు 6–7 లక్షలకే ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోండి. సహాయ కార్యక్రమాల కోసం నిధులు విడుదల చేశాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement