ఫోన్ యాప్ ద్వారా పంట వివరాల నమోదుకు తిరస్కరణ
పంట వివరాలన్నీ రైతు సేవా కేంద్రంలోని కంప్యూటర్ ద్వారానే నమోదు
వెబ్‌సైట్‌లోనూ సాంకేతిక సమస్యలు ∙వివరాల నమోదుకే రోజంతా సరి
క్షేత్రస్థాయికి ఎప్పుడు వెళ్తామంటున్న సిబ్బంది
కౌలుదారుల పంట వివరాల నమోదులోనూ ఇబ్బందులు
సీసీఆర్సీ లేదా భూ యజమాని అంగీకారంతోనే నమోదు
ఇలా అయితే నష్టమే అంటున్న కౌలుదారులు
వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్లూ సాఫీగా పంటల నమోదు
దాని ద్వారా రైతులకు పలు ప్రయోజనాలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెచి్చన మంచి కార్యక్రమాలన్నింటినీ చీల్చి ఛిద్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలి్పంచే ‘ఈ–క్రాప్’ కార్యక్రమాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఐదేళ్లూ నిరాఘాటంగా సాగి, అన్నదాతలకు అండగా నిలిచింది.
రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు దీని పేరును ‘ఈ–పంట’ అని మార్చి, దాని నమోదులోనూ మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఈ మార్పులే రైతులపాలిట శాపంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఫొన్ యాప్ ద్వారా పంటల వివరాల నమోదుకు అంగీకరించడంలేదు. అప్‌డేట్ చేసిన ఈ–పంట వెబ్‌సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రైతు సేవా కేంద్రం (ఆర్బీకే)లోని సిస్టమ్ ద్వారా మాత్రమే పంట వివరాలు నమోదు చేయాలన్న నిబంధన మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది.
వెబ్‌సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి జాతీయ స్థాయిలో కేంద్రం శ్రీకారం చుట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానం చేసి ఈ పంట నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31న మార్గదర్శకాలు జారీ చేసి, ఈ నెల 5 నుంచి పంటల నమోదు చేపట్టింది. ఈ పంట వెబ్‌సైట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. యాప్‌లో కొత్త ఫీచర్స్‌పై క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణా ఇవ్వలేదు. గతంలో ఫోన్‌లోనే ఈ–క్రాప్ యాప్ ద్వారా పంట వివరాలు నమోదు చేసేవారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో ఫోటోలు అప్‌లోడ్ చేసేవారు. దీని వల్ల సమయం ఆదా అయ్యేది.
ప్రస్తుతం ఈ పంట వివరాలు ఫోన్‌లో నమోదు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంలేదు. కార్యాలయం కంప్యూటర్‌లోని వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను కంప్యూటర్ నుంచి ఫోన్‌లోని యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. రైతు సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అసలు కంప్యూటర్‌లో ఈ పంట వెబ్‌సైట్ ఓపెన్ అవడమే చాలా కష్టం. అది ఓపెన్ అయిన తర్వాత పంట వివరాలు నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
దీంతో ఒక్కో రైతు పంట వివరాల నమోదుకు చాలా సమయం పడుతోంది. పైగా పంట వివరాల నమోదుకే రోజంతా కార్యాలయంలోనే ఉండాల్సి వస్తోందని, క్షేత్ర స్థాయి పరిశీలన ఎప్పుడు పూర్తి చేస్తామని సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్‌లో నుంచి మళ్లీ ఎలాగూ ఫోన్లోకి తీసుకోవాలని, అప్పుడు నేరుగా ఫోన్‌లోనే వివరాలు నమోదు చేసుకోవచ్చు కదా అన్న సూచనలూ వస్తున్నాయి. మరోపక్క కౌలుదారుల పంట వివరాల నమోదులోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సీసీఆర్సీ లేదా భూ యజమాని అంగీకారంతోనే నమోదుకు అవకాశం ఉంది. కానీ ఉన్నతాధికారులు వాస్తవ సాగు దారుల వివరాలు నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అలా చేస్తే భూ యజమానుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కౌలుదారులు వాపోతున్నారు. మరొక వైపు సిబ్బందికి ఇచి్చన ట్యాబ్‌లు కూడా సరిగా పనిచేయడంలేదు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
గడువులోగా పూర్తయ్యేనా?
రైతుల నుంచి పంట వివరాలు సేకరించాక పొలం వద్దకు వెళ్లి జియోఫెన్సింగ్‌తో సహా పంట ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేట్స్‌తో సహా ఎల్‌పీ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఆర్బీకే సిబ్బంది, వీఆర్వోల ధ్రువీకరణ పూర్తి కాగానే రైతుల ఈ కేవైసీ నమోదు చేసి రైతులకు డిజిటల్, ఫిజికల్ రసీదులు ఇవ్వాలి. గతేడాది మాదిరిగానే సెపె్టంబర్ 15వ తేదీలోగా ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 19 నుంచి 24వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద ఆర్‌ఎస్‌కేలలో ప్రదర్శిస్తారు.
రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను 25 నుంచి 28వ తేదీ వరకు పరిష్కరిస్తారు. తుది జాబితాలను 30వ తేదీన ఆర్‌ఎస్‌కేలలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, ఈ పంట నమోదులో ఉన్న గందరగోళ పరిస్థితుల మధ్య గడువులోగా పంటల నమోదు పూర్తవుతుందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో ఈ–పంట నమోదు
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ నుంచి ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కుపత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద పంట వివరాలు నమోదు చేసేవారు. ఏటా ఖరీఫ్‌లో జూలై మొదటి వారంలో మొదలు పెట్టి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేసేవారు.
సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్‌లో నవంబర్ మొదటి వారంలో శ్రీకారం చుట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా, 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం పంటలు కూడా నమోదు కాని దుస్థితి.
ఆలస్యమైతే జరిగే నష్టమిది..
ఈ క్రాప్ నమోదు ఆలస్యమైతే రైతులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. ప్రధానంగా పంట కొనుగోలులో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట కోనుగోలు పూర్తిగా ఈ–పంట నమోదు ఆధారంగానే జరుగుతుంది. దీంతో రైతులు దళారుల ద్వారా పంటలను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉచిత పంటల బీమాకు అర్హత కోల్పోతారు. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట రైతులు ఈ–క్రాప్‌లో నమోదు కాకపోతే ఇన్‌పుట్ సబ్సిడీ పొందే అర్హత కోల్పోతారు. సున్నా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోతారు.
ఈ –క్రాప్‌తో ఐదేళ్లలో రైతులకు జరిగిన మేలు..
గడిచిన ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలు నమోదు కాగా, ఈ–క్రాప్ ప్రామాణికంగా వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించారు. 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు, 176.36 లక్షల టన్నుల ఎరువులు అందాయి. 5.13 కోట్ల మంది రైతులకు రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు లభించాయి. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం, 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ, 84.67 లక్షల మందికి రూ.2051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలు అందాయి. రైతులు పండించిన పంటల విక్రయం సాఫీగా సాగి, ప్రతి పంటకీ మద్దతు ధర లభించింది.
Comments
Please login to add a commentAdd a comment