
సర్టిఫికెట్ల సమస్య
- జేఎన్టీయూహెచ్‌లో 20 రోజులుగా అందని ధ్రువపత్రాలు
- ఉపాధి అవకాశాలను కోల్పోతున్న విద్యార్థులు
- తత్కాల్ పేరిట వసూళ్లు
సాక్షి, సిటీబ్యూరో: సర్టిఫికెట్ల జారీలో జేఎన్టీయూహెచ్ నత్తనడకన సాగుతోంది. వార్షిక పరీక్షలు, ఫలితాల ప్రకటనలోనే కాదు.. సర్టిఫికెట్ల జారీలోనూ వర్సిటీ తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. సకాలంలో సర్టిఫికెట్లు అందక విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంటుంది.
20 రోజులు గడిచినా..
యూనివర్సిటీ పరిధిలోని అఫిలియేటెడ్ కళాశాలల విద్యార్థులకు గత ఏప్రిల్‌లో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ ఫైనలియర్ పరీక్షల ఫలితాలను గత నెల 31న విడుదల చేశారు. సుమారు 80 వేల మంది విద్యార్థులు ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విడుదల చేసిన వారం రోజుల్లోగా సంబంధిత కళాశాలల ద్వారా సర్టిఫికెట్లు (మార్కుల జాబితా, సీఎంఎం, పీసీ)ను విద్యార్థులకు అందజేయడం ఆనవాయితీ.
అయితే ఈ ఏడాది బీటెక్, బీఫార్మసీ ఫైనలియర్ ఫలితాలొచ్చి 20 రోజులు గడిచినా సర్టిఫికెట్లు మాత్రం కళాశాలలకు చే రకపోవడంతో విద్యార్థులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. దేశ, విదేశ వర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిట్టూర్పు తప్పడం లేదు. అంతేకాదు.. బీటెక్ పాసైన ఎంతోమంది విద్యార్థులు పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైనా.. సర్టిఫికేట్లు లేకపోవడంతో అవకాశాలను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.
డబ్బులిస్తే..
సర్టిఫికెట్ల జారీలో జేఎన్టీయూహెచ్ అధికారులు వ్యాపార ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. అత్యవసరమైతే రూ.2 వేలు ఫీజు అదనంగా చెల్లించి తత్కాల్ స్కీమ్ కింద ధ్రువపత్రాలను వెంటనే తీసుకోవచ్చని అధికారులు అంటున్నారు. సర్టిఫికెట్ల జారీలో జేఎన్టీయూహెచ్ సిబ్బంది చేస్తున్న జాప్యానికి విద్యార్థులు పరిహారం చెల్లించాల్సి రావడం దురదృష్టకరం. ఈఏడాది ఇప్పటికే సుమారు వెయ్యిమందికి పైగా తత్కాల్ స్కీమ్ ద్వారా సర్టిఫికేట్లు తీసుకోవడంతో జేఎన్టీయూహెచ్‌కు రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. ఇలాగే జాప్యం చేస్తే మరింత ఆదాయం సమకూరుతుందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు.
ఆలస్యం వాస్తవమే.
ప్రింటింగ్‌లో జాప్యం కారణంగా సర్టిఫికేట్లను సకాలంలో అందించలేకపోవడం వాస్తవమే. అదనపు ప్రింటింగ్ మిషన్లను కొనుగోలు చేశాం. ఇప్పటికే ముద్రణ పూర్తయిన ధ్రువపత్రాలను ఆయా కళాశాలలకు పంపిణీ చేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే విద్యార్థులందరికీ ధ్రువపత్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
- ఈశ్వర్‌ప్రసాద్, డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్