
దోపిడీ కేంద్రాలు !
ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలకు సేవలందించాల్సిన మీ -సేవ కేంద్రాలు చాలాచోట్ల దోపిడీకి నిలయాలుగా మారాయి.
మీ-సేవల్లో చాలా జాప్యం
ఇష్టారాజ్యంగా చార్జీలు
చాలా చోట్ల పనిచేయని సర్వర్లు
కేంద్రాల వద్ద క్యూకడుతున్న జనం
చిత్తూరు: ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలకు సేవలందించాల్సిన మీ -సేవ కేంద్రాలు చాలాచోట్ల దోపిడీకి నిలయాలుగా మారాయి. సకాలంలో సర్టిఫికెట్లు కావాలంటే అడిగినకాడికి ముట్టచెప్పాల్సి వస్తోంది. ఆధార్‌కార్డుకు ప్రభుత్వమే ధర చెల్లిస్తున్నా మీ - సేవ కేంద్రాలు మాత్రం ప్రజల నుంచి కొన్ని వందల రూపాయలు వసూలు చేస్తున్నాయి. రేషన్‌కార్డుల్లో తప్పులు సవరించేందుకు భారీగానే ముట్టజెప్పాల్సి వస్తోంది. విద్యార్థుల సర్టిఫికెట్ కావాలంటే అడిగినంత ముట్టజెప్పితేనే సకాలంలో ఇస్తున్నారు లేకపోతే రోజుల తరబడి తిప్పుతున్నారు. మరోవైపు కేంద్రాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో ప్రజలు మీ- సేవ కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సి వస్తోం ది. ప్రతి సర్టిఫికెట్‌కు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెండింతలు, మూడింతలు అధికంగా వసూలు చేస్తున్నారు. నిబంధనలమేరకు ధరను చెల్లిస్తానన్న వారిని మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఆలస్యంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో 11 మీ- సేవ కేంద్రాలున్నాయి. చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెంలో సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. ఆధార్ కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు, రేషన్‌కార్డులతోపాటు మిగిలిన వాటి కోసం 10 నుంచి 15 రోజుల వరకు వేచిచూడాల్సి వస్తోంది.
పలమనేరు నియోజకవర్గంలో 16 కేంద్రాలున్నాయి. కేంద్రాల వద్ద ధరల పట్టికలు లేవు. కుల, ఆదాయ సర్టిఫికెట్లకు రూ.100 వసూలుచేస్తున్నారు. ఎస్‌ఎంబీ స్కెచ్ ఒక్క సర్వే నంబర్‌కే రూ.700 పైగా వసూలు చేస్తున్నారు. ఆధార్ కార్డుకు సైతం డబ్బు గుంజుతున్నారు. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక సరిహద్దు కావడంతో ఆధార్ కార్డు కు వేలల్లో కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు డబ్బు చెల్లిస్తామన్న వారిని నెలల తరబడి తిప్పుతున్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో 14 మీ-సేవ కేంద్రాలున్నాయి. బుచ్చినాయుడు కండ్రిగ, నారాయణవనం మండలాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. ఈ-పాసుపుస్తకాలు మరింత ఆలస్యమవుతోంది.
నగరి నియోజకవర్గంలో 10 కేంద్రాలున్నాయి. పుత్తూరు కేంద్రంలో సర్టిఫికెట్ల జారీకి 10 నుంచి 15 రోజులు పడుతోంది. కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలకు నెల పడుతోంది. నగరిలో తరచూ సర్వర్లు పని చేయడంలేదు. బర్త్ సర్టిఫికెట్ కు రూ.100 పైగా తీసుకుంటున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో 14 మీ- సేవ కేంద్రాలున్నాయి. సర్వర్ సమస్య అధికంగా ఉంది. ఆధార్ కార్డుకు డబ్బు తీసుకుంటున్నారు. ఆధార్‌లో తప్పులు సరిదిద్దాలంటే రూ.15 తీసుకోవాల్సి ఉండగా, రూ.100 డిమాండ్ చేస్తున్నారు.
మదనపల్లె నియోజకవర్గంలో సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రతి దానికి రెండింతలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే సంబంధిత కాగితాలు ఇవ్వడానికి మరింత ఆలస్యం చేస్తున్నారు.
హస్తి నియోజకవర్గంలో 11 మీ- సేవ కేంద్రాలున్నాయి. ఇక్కడ కూడా సర్వర్లు పనిచేయడంలేదు. ప్రతి సర్టిఫికెట్‌కు రెండింతలకుపైగా అదనంగా వసూలు చేస్తున్నారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 7 మీ-సేవ కేంద్రాలున్నాయి. సర్వర్ల సమస్యలు అధికంగా ఉన్నాయి. పెనుమూరు,కార్వేటినగరం తప్ప మిగిలిన చోట్ల బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీకి 25 రోజులకుపైనే పడుతోంది. ఏ పనీ సకాలంలో కావడం లేదు.
పీలేరు నియోజకవర్గంలో 14 కేంద్రాలున్నాయి. సర్వర్లు సరిగా పనిచేయడం లేదు. ప్రతిచోటా నిబంధనలకు విరుద్ధంగా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. రూ 5 స్టాంపునకు రూ.30, ఆధార్‌కార్డుకు రూ.100 వంతున వసూలు చేస్తున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో 14 కేంద్రాలున్నాయి. ఏపీ ఆన్‌లైన్ సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. పుంగనూరు మున్సిపాలిటీలో సర్టిఫికెట్ల జారీ మరింత ఆలస్యమవుతోంది. నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.
పూతలపట్టు నియోజకవర్గంలో 11 కేంద్రాలున్నాయి. ఐరాల, పొలకల ప్రాంతాల్లో వారంలో నాలుగు రోజులపాటు సర్వర్లు పనిచేయడం లేదు. ఆధార్ కార్డుకు రూ.150 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తున్నారు.
కుప్పం నియోజకవర్గంలో 14 మీ-సేవ కేంద్రాలున్నాయి. సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. వారంలో అందాల్సిన సర్టిఫికెట్లకు నెలలు పడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సి వస్తోంది.
చిత్తూరు నియోజకవర్గంలో మీ- సేవ, ఈ-సేవలు కలిపి 11 కేంద్రాలున్నాయి. ఎక్కడా సర్వర్లు సక్రమంగా పనిచేయడంలేదు ప్రతి దానికి రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. అయినా నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.