నెల రోజులైనా కదలని ఫైళ్లు
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : హైదరాబాద్-కర్ణాటక వాసులుగా సర్టిఫికెట్లు పొందేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని, దరఖాస్తులు సమర్పించి నెల రోజులవుతున్నా ఫైళ్లు కదలడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చినా వీటి పై సరైన సమాచారం ఇచ్చే వారే లేరు.
కార్యాలయంలో క్లర్కులను అడిగితే కసురుకుంటారే తప్ప సరైన సమాచారం ఇవ్వడం లేదు. తొలుత దరఖాస్తుదారులు అన్ని దాఖలాలతో తపాలాలో ఇవ్వమంటారు. ఆ తర్వాత నెలరోజులైనా ఏ సమాచారం ఇవ్వరు. దీనిపై తపాలాలో అడిగితే క్లర్కులను అడగమని, క్లర్కులను అడిగితే ఆర్‌ఐ కార్యాలయానికి వెళ్లమని, అక్కడకు వెళ్లితే వీఏఓను కలవమని, ఆయనను కలుస్తామంటే అందుబాటులో లేకపోవడం, అందుబాటులో ఉన్నా ఏదో సాకుతో మరుసటి రోజు రమ్మని చెబుతున్నారన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఒక్కసారిగా దరఖాస్తులు వస్తున్నందున తాము అధిక భారంతో పని చేయలేకపోతున్నామని, దీని నిర్వహణ చేపట్టే ఓ క్లర్కు చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వీటి కోసం ప్రత్యేక సిబ్బందిని కేటాయించి త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఈ దరఖాస్తులను కూడా సకాల పథకంలో ప్రవేశ పెట్టాలని పలు సంఘ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
హైదరాబాద్ - కర్ణాటక నివాసి ధ్రువీకరణ కోసం ఇక్కట్లు
Published Wed, Apr 23 2014 5:11 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement