మయాంక్ అగర్వాల్
న్యూఢిల్లీ: లీగ్ దశలో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. కర్ణాటకతో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ 103 పరుగుల తేడాతో ఓడింది. తొలుత కర్ణాటక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (111 బంతుల్లో 140; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ సమర్థ్ (124 బంతుల్లో 125; 13 ఫోర్లు) సెంచరీలు చేయడంతోపాటు రెండో వికెట్‌కు 242 పరుగులు జోడించారు.
హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ (5/59) మినహా మిగతావారు విఫలమయ్యారు. 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 42.5 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అంబటి రాయుడు (62 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), టి.రవితేజ (57 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఒకదశలో 202/3తో పటిష్టంగా కనిపించిన హైదరాబాద్ శ్రేయస్ గోపాల్ (5/31), స్టువర్ట్ బిన్నీ (3/45) ధాటికి 42 పరుగులకే చివరి ఏడు వికెట్లు చేజార్చుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో మహారాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో ముంబైను బోల్తా కొట్టించింది. గురువారం న్యూఢిల్లీలోనే జరిగే మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఢిల్లీతో ఆంధ్ర; సౌరాష్ట్రతో బరోడా తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment