విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో తిలక్ 99 పరుగుల (106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్) వద్ద ఔటయ్యాడు. కర్ణాటక నిర్దేశించిన 321 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తిలక్ ఔటైనా వరుణ్ గౌడ్ సూపర్ సెంచరీతో (109 నాటౌట్) హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ ఔటయ్యాక హైదరాబాద్ గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో వరుణ్ గౌడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వరుణ్ 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. వరుణ్ చెలరేగడంతో హైదరాబాద్ మరో రెండు బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో నికిన్ జోస్ 37, కేవీ అనీశ్ 11, స్మరణ్ రవిచంద్రన్ 83, అభినవ్ మనోహర్ 1, కృష్ణణ్ శ్రీజిత్ 5, ప్రవీణ్ దూబే 24, విద్యాధర్ పాటిల్ 1, శ్రేయస్ గోపాల్ 19 (నాటౌట్), అభిలాశ్ షెట్టి 4 (నాటౌట్) పరుగులు చేశారు.
హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి 2, ముదస్సిర్, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ తిలక్ వర్మ పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. వరుణ్ గౌడ్ అద్భుతమైన శతకంతో తన జట్టును గెలిపించాడు.
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్ 35, రోహిత్ రాయుడు 0, హిమతేజ 15, నితేశ్ రెడ్డి 0, అరవెల్లి అవనీశ్ 17, తనయ్ త్యాగరాజన్ 25, చామ మిలింద్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. అభిలాశ్ శెట్టి, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
మయాంక్ హ్యాట్రిక్ సెంచరీస్
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. డిసెంబర్ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. డిసెంబర్ 28న అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ మరో సెంచరీ చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment