కర్ణాటకతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2023 రెండో సెమీఫైనల్లో రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా భారీ సెంచరీతో (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్స్‌కు చేరింది. డిసెంబర్ 16న జరిగే తుది సమరంలో రాజస్థాన్.. హర్యానాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆరు, ఏడు నంబర్ ఆటగాళ్లు అభినవ్ మనోహర్ (91), మనోజ్ భాండగే (63) రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సమర్థ్ (8), మయాంక్ అగర్వాల్ (13) విఫలం కాగా.. నికిన్ జోస్ (21), శ్రీజిత్ (37), మనీశ్ పాండే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, అరాఫత్ ఖాన్, రాహుల్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్.. ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత వన్‌డౌన్ బ్యాటర్ మహిపాల్ లోమ్రార్ (14) కూడా తక్కువ స్కోర్‌కే ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ దశలో బరిలోకి దిగిన దీపక్ హుడా.. కరణ్ లాంబా (73 నాటౌట్) సహకారంతో రాజస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపు ఖాయం అనుకున్న దశలో హుడా డబుల్ సెంచరీ చేరువలో ఔటయ్యాడు. హుడా, కరణ్ చెలరేగడంతో రాజస్థాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, వైశాక్, భాండగే, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment