సత్తా చాటిన పడిక్కల్‌.. ఫైనల్లో కర్ణాటక | Padikkal Shines Yet Another Time, Karnataka Into The Final Of Vijay Hazare Trophy | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన పడిక్కల్‌.. ఫైనల్లో కర్ణాటక

Published Thu, Jan 16 2025 12:20 PM | Last Updated on Thu, Jan 16 2025 12:31 PM

Padikkal Shines Yet Another Time, Karnataka Into The Final Of Vijay Hazare Trophy

విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక ఫైనల్‌కు చేరింది. నిన్న (జనవరి 15) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు హర్యానాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. హిమాన్షు రాణా (44), అనుజ్‌ థక్రాల్‌ (23 నాటౌట్‌), రాహుల్‌ తెవాటియా (22), సుమిత్‌ కుమార్‌ (21), దినేశ్‌ బనా (20), అమిత్‌ రాణా (15 నాటౌట్‌), ఆర్ష్‌ రంగా (10), నిషాంత్‌ సంధు (10) రెండంకెల స్కోర్లు చేశారు. 

కర్ణాటక బౌలర్లలో అభిలాష్‌ శెట్టి నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో రెండు, హార్దిక్‌ రాజ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ మూడు క్యాచ్‌లు పట్టాడు.

238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫీల్డర్‌గా రాణించిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. పడిక్కల్‌ 113 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 86 పరుగులు చేశాడు. పడిక్కల్‌కు జతగా స్మరణ్‌ రవిచంద్రన్‌ కూడా రాణించాడు. స్మరణ్‌ 94 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేశాడు. 

ఈ టోర్నీ ప్రారంభం​ నుంచి భీకర ఫామ్‌లో ఉండిన కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. అనీశ్‌ 22, కృష్ణణ్‌ శ్రీజిత్‌ 3 పరుగులు చేసి ఔట్‌ కాగా.. శ్రేయస్‌ గోపాల్‌ (23 నాటౌట్‌), అభినవ్‌ మనోహర్‌ (2 నాటౌట్‌) కర్ణాటకను విజయతీరాలకు చేర్చారు. హర్యానా బౌలర్లలో నిషాంత్‌ సంధు రెండు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్‌ కంబోజ్‌, అమిత్‌ రాణా, పార్త్‌ వట్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

వరుసగా రెండో మ్యాచ్‌లో సత్తా చాటిన పడిక్కల్‌
కర్ణాటక ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో సత్తా చాటాడు. సెమీస్‌కు ముందు క్వార్టర్‌ ఫైనల్లోనూ పడిక్కల్‌ ఇరగదీశాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్‌ (102) సూపర్‌ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనకు గానూ పడిక్కల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. హర్యానాతో జరిగిన సెమీస్‌లోనూ పడిక్కల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

మహారాష్ట్రతో విదర్భ 'ఢీ'
ఇవాళ జరుగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర, విదర్భ జట్లు ఢీకొంటాయి. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు జనవరి 18న జరిగే ఫైనల్లో కర్ణాటకతో అమీతుమీ తేల్చుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement