వరుసగా మూడో సెంచరీ చేసిన మయాంక్‌ అగర్వాల్‌ | HYD VS KAR: THREE CONSECUTIVE HUNDREDS FOR MAYANK AGARWAL IN VIJAY HAZARE TROPHY | Sakshi
Sakshi News home page

వరుసగా మూడో సెంచరీ చేసిన మయాంక్‌ అగర్వాల్‌

Published Tue, Dec 31 2024 2:49 PM | Last Updated on Tue, Dec 31 2024 3:02 PM

HYD VS KAR: THREE CONSECUTIVE HUNDREDS FOR MAYANK AGARWAL IN VIJAY HAZARE TROPHY

విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2024-25లో కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal) సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మయాంక్‌ హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించాడు. డిసెంబర్‌ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్‌.. డిసెంబర్‌ 28న అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. 

ఇవాళ (డిసెంబర్‌ 31) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్‌ 112 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసి హ్యాట్రిక్‌ సెంచరీలు నమోదు చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మయాంక్‌ సూపర్‌ సెంచరీతో విరుచుకుపడటంతో కర్ణాటక భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.

ఓపెనర్‌గా వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ సూపర్‌ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్‌ నికిన్‌ జోస్‌ 37, వన్‌డౌన్‌లో వచ్చిన కేవీ అనీశ్‌ 11, ఆతర్వాత వచ్చి న స్మరణ్‌ రవిచంద్రన్‌ 83, అభినవ్‌ మనోహర్‌ 1, కృష్ణణ్‌ శ్రీజిత్‌ 5, ప్రవీణ్‌ దూబే 24, విద్యాధర్‌ పాటిల్‌ 1, శ్రేయస్‌ గోపాల్‌ 19 (నాటౌట్‌), అభిలాశ్‌ షెట్టి 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

హైదరాబాద్‌ బౌలర్లలో చామ మిలింద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్‌ రెడ్డి 2, ముదస్సిర్‌, రోహిత్‌ రాయుడు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ 13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే రోహిత్‌ రాయుడు డకౌటయ్యాడు. అభిలాశ్‌ షెట్టి రోహిత్‌ రాయుడును క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. తన్మయ్‌ అగర్వాల్‌ (30), కెప్టెన్‌ తిలక్‌ వర్మ (25) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలవాలంటే 37 ఓవర్లలో మరో 263 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.

గ్రూప్‌ టాపర్‌గా కర్ణాటక
విజయ్‌ హజారే ట్రోఫీ పాయింట్ల పట్టికలో కర్ణాటక గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. గ్రూప్‌-సిలో కర్ణాటక ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. గ్రూప్‌-సిలో పంజాబ్‌, సౌరాష్ట్ర, ముంబై వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్‌ ఐదో స్థానంలో నిలిచింది. గ్రూప్‌-ఏలో గుజరాత్‌.. గ్రూప్‌-బి నుంచి మహారాష్ట్ర, గ్రూప్‌-డి నుంచి విదర్భ, గ్రూప్‌-ఈ నుంచి మధ్యప్రదేశ్‌ టాపర్లుగా ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement