25లోగా ఎస్సీ, ఎస్టీలు సర్టిఫికెట్లు అందజేయాలి | 25 before SC and st certificates shall be provided | Sakshi
Sakshi News home page

25లోగా ఎస్సీ, ఎస్టీలు సర్టిఫికెట్లు అందజేయాలి

Published Fri, Jan 10 2014 3:00 AM | Last Updated on Sat, Sep 15 2018 3:18 PM

25 before SC and st certificates shall be provided

 తాండూరు టౌన్, న్యూస్‌లైన్ : యాభై యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న ఎస్సీ, ఎస్టీలు ఈ నెల 25వ తేదీలోగా సర్టిఫికెట్లను అందజేయాలని వికారాబాద్ డివిజన్ విద్యుత్ శాఖ డీఈఈ సాంబశివరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన తాండూరులోని ఏడీఈ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రకారం యాభై యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి బిల్లులు చెల్లించనవసరం లేదన్నారు. ఒకవేళ 51 యూనిట్లు వినియోగించుకుంటే మాత్రం మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశం పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల వారితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వారికీ వర్తిస్తుందన్నారు. తాండూరు పట్టణంలోని హరిజనవాడ, మాణిక్‌నగర్, చెంగోల్ బస్తీ, పుల్లమ్మ దొడ్డి ప్రాంతాల్లో నివసించే వారు ఈ పథకం కిందికి వస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు కులధ్రువీకరణ పత్రం, 6నెలల లోపు చెల్లించిన విద్యుత్ బిల్లు జిరాక్స్‌లను సహాయ లైన్‌మన్ సహా ఆపై అధికారులకు ఎవరికైనా సమర్పించవచ్చన్నారు. ఈ వివరాలన్నిం టినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నామని వివరించారు.
 
 డివిజన్‌లో రూ.10కోట్ల మేర వినియోగదారులకు లబ్ధి
 ఈ పథకంతో వికారాబాద్ డివిజన్‌లోని 17 మండలాల్లో సుమారు 35వేల మంది ఎస్సీ, ఎస్టీ సర్వీసుదారులకు సుమారు రూ.10 కోట్లు లబ్ధి చేకూరుతుందని విద్యుత్ డీఈఈ సాంబశివరావు పేర్కొన్నారు. 31 మార్చి 2013లోపు 50 యూనిట్లలోగా వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీలు ఒకవేళ బిల్లులు చెల్లించి ఉంటే అందుకు సంబంధిం చిన డబ్బులను వారికి తిరిగి అందించనున్నామన్నారు. గతంలో తొలగించిన మీటర్లు పునరుద్ధరించాలంటే రూ.1100 డీడీ చెల్లించాలని సూచించారు.
 
 6వేల మంది రైతులకు స్లాబ్ పుస్తకాల అందజేత
 ఇటీవలే డివిజన్ పరిధిలోని 6వేల మంది రైతులకు ఉచిత విద్యుత్ వినియోగానికి సంబంధించిన స్లాబ్ పుస్తకాలను అందజేశామని ఆయన చెప్పారు. దీనివల్ల సర్వీసు చార్జీల బకాయిలు రూ.70లక్షలు వసూలయ్యాయన్నారు. అలాగే రూ.12.50కోట్ల బకాయిలు కూడా రైతులు చెల్లించినట్లు తెలిపారు.
 
 రూ.77 కోట్ల బకాయిలు..
 డివిజన్‌వ్యాప్తంగా విద్యుత్ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయని డీఈఈ పేర్కొన్నారు. గృహ వినియోగదారులు రూ.45 కోట్లు, వీధి దీపాలు, నీటి సరఫరాకు సంబంధించి రూ.30 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.77 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్షన్లు తొలగిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బం దులు తలెత్తకుండా చూసేందుకు, ప్రమాదాలు నివారించేందుకు 19 సబ్ స్టేషన్లలో 76మంది ఆపరేటర్లను నియమిం చినట్లు తెలిపారు. ఈసారి వేసవిలో ఎలాంటి కరెంటు కోతలు ఉండవని, ఏప్రిల్ తర్వాత రాష్ట్రానికి నార్త్‌గ్రిడ్ నుంచి సుమారు 1500 మెగావాట్ల విద్యుత్ రానుందన్నారు. అంతకుముందు తాండూరు ఏఈ తుల్జారామ్‌సింగ్‌తో కలిసి ఆయన సబ్‌డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ సిబ్బందితో సమావేశమయ్యారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement