సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే..
Published Thu, Dec 5 2013 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
శృంగవరపుకోట రూరల్, న్యూస్‌లైన్ : విద్యార్థుల సర్టిఫికెట్లను వెంటనే వారికి అందజేయాలని పలు కళాశాలల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశాఖ-అరకు ప్రధాన రహదారిలో బుధవారం రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై బాలాజీరావు, సిబ్బందితో తరలివచ్చి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉందని, ఆందళన కార్యక్రమాలు విరమించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దశలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గణేష్ కలుగజేసుకుని ముందుగా విద్యార్థులను మోసగిస్తున్న కళాశాలల యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌వీఎన్, వివేకానంద కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఆందోళన విరమిస్తే సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఎస్సై బాలాజీరావు హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించి స్థానిక ఎస్‌వీఎన్ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నేత జె.గౌరీష్ మాట్లాడుతూ, పలు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను బినామీలుగా చేర్చుకుని విద్యార్థుల స్కాలర్‌షిప్పులను కాజేస్తున్నారని ఆరోపించారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా అదనపు సొమ్ము వసూలు చేస్తున్నారన్నారు.
ఆరు నెలలుగా తిప్పుతున్నారు
ఎస్‌వీఎన్ కళాశాలలో 2011-13లో ఎంపీహెచ్‌డబ్ల్యు ఇంటర్ కోర్స్‌లో చేరి పాసైనట్లు జామి మండలం అలమండ సంత గ్రామానికి చెందిన విద్యార్థిని వెల్దూటి ఎర్నమ్మ తెలిపింది. జాయినింగ్ సమయంలో అందజేసిన సర్టిఫికెట్లను ఇవ్వాలని జూన్ నెల నుంచి కోరుతుంటే ఇవ్వడం లేదని వాపోయింది. కొద్ది రోజల కిందట నుంచి సర్టిఫికెట్లు కావాలంటే వివేకానంద కళాశాల నుంచి తీసుకోవాలని చెబుతున్నారని తెలిపింది. ఆ కళాశాలలో అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం నర్స్ కోర్సులో ప్రవేశించేందుకు సమయం ఆసన్నమవుతోందని, ఇంటర్ సర్టిఫికెట్‌తో పాటు పదో తరగతి సర్టిఫికెట్ అవసరం ఉందని తెలిపింది. వివేకానంద కళాశాల వారిని గట్టిగా అడిగితే రూ. 13 వేలు డిమాండ్ చేశారని చెప్పింది. అలాగే తనకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేదని కర్రి ముత్యాలమ్మ అనే విద్యార్థిని తెలిపింది.
వివేకానంద కళాశాల వారే సర్టిఫికెట్లు ఇవ్వాలి..
వివేకానంద కళాశాల వారే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎస్‌వీఎన్ కళాశాల కరస్పాండెంట్ జె. కృష్ణ తెలిపారు. ఇంటర్‌లో చేరేందుకు తమ కళాశాలకు ఎక్కువ మంది విద్యార్థులు రావడంతో సీట్లు ఖాళీలేక 17 మంది విద్యార్థులను వివేకానంద కళాశాలకు పంపించామని చెప్పారు. సర్టిఫికెట్లు కూడా అప్పట్లోనే వారికి అందజేశామన్నారు. అడ్మిషన్ పరంగా విద్యార్థులు వివేకానంద కళాశాలలో చేరినా తమ కళాశాలలోనే చదువు కొనసాగించారని చెప్పారు. ఈ మధ్యలో వివేకానంద యాజమాన్యంతో అభిప్రాయ బేధాలు రావడంతో వారు కావాలనే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.
కానరాని సర్టిఫికెట్లు
విద్యార్థిని ఎర్నమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై బాలాజీరావు రెండు కళాశాలల యాజమాన్యాలను పిలిపించి సమస్యపై ఆరా తీశారు. సర్టిఫికెట్లు విద్యార్థులకు అందజేయాలని సూచించారు. అయితే విద్యార్థులకు సంబంధించిన పదో తరగతి సర్టిఫికెట్లు కనిపించనట్లు తెలిసింది. దీంతో విద్యార్థులు ఇంటర్ సర్టిఫికెట్లు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఈ విషయమై గురువారం నుంచి ఆందోళనలు చేపట్టి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement