ఇంజనీరింగ్ విద్యార్థులకూ అనుమతి గోస
- ముందస్తుగా సర్టిఫికెట్లు తీసుకున్న కాలేజీల నిర్వాహకులు
- అఫిలియేషన్ రద్దు నేపథ్యంలో ఇవ్వాలని విద్యార్థుల ఒత్తిళ్లు
- ససేమిరా అంటున్న కళాశాలల యాజమాన్యాలు
- నేటితో మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తి
- ఆందోళనలో అభ్యర్థులు
జనగామ : ఇంజనీరింగ్ కళాశాలల అఫిలియేషన్ రద్దు ఆయూ విద్యాసంస్థల యూజమాన్యాలను ఇబ్బందుల్లోకి నెట్టగా.... విద్యార్థులకూ తలనొప్పి తెచ్చిపెట్టింది. మా కళాశాలలో చేరండంటూ విద్యార్థుల నుంచి ముందస్తుగా సర్టిఫికెట్లు తీసుకున్న ఆయూ యూజమాన్యాలు ఇప్పుడు మొండికేస్తున్నాయి. కళాశాలలకు అనుమతి రాకున్నా.. నేడో రేపో వస్తుందంటూ సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి.
మొదటి దశ కౌన్సెలింగ్‌కు శనివారం చివరి తేదీ కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సదరు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి మార్గదర్శకాలను అనుసరించి మౌలిక వసతులు, అర్హత గల అధ్యాపకులు లేని ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది.
రాష్ట్రవ్యాప్తంగా 315 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా.. వీటిలో 174 కళాశాలలకు అనుబంధ గుర్తింపు లభించలేదు. మన వరంగల్ జిల్లాలో మొత్తం 28 కళాశాలలు ఉండగా.. 18 కళాశాలలకు మాత్రమే అనుమతి వచ్చింది. వీటిలో జేఎన్‌టీయూహెచ్‌పరిధిలో 12, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆరు ఉన్నాయి. మిగతా పదింటికి అనుమతి రాలేదు. ఈ అనుమతి రాని కళాశాలల పేర్లు కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించారు. దీంతో యాజమాన్యాలు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాయి.. అయినా పట్టువీడని ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు ససేమిరా అంటున్న పరిస్థితులు ఉన్నాయి.
ఇక్కడే అసలు సమస్య
పేరున్న ఇంజనీరింగ్ కళాశాలల్లోకి విద్యార్థులు ఎలాగోలా వస్తారు గానీ... అంతంతమాత్రం పేరున్న కళాశాలల్లో సీట్ల భర్తీ అంత తేలిక కాదు. దీంతో విద్యార్థులను ఆకర్షించేందుకు పలు మార్గాలను ఎంచుకున్నాయి. ఎలాగైనా తమ కళాశాల అనుమతులు పునరుద్ధరిస్తారన్న ఆశతో ఆయా ఇంజనీరింగ్ కళాశాలలు తమ కాన్వాసింగ్ పనులు ముమ్మరం చేశాయి. కొంత మంది దళారుల పరస్పర ‘సహకారం’తో ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఆకర్షించే పనులు చేపట్టాయి.
ఇదే క్రమంలో జిల్లాలోని పలు కళాశాలల నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లోని దళారులతోపాటు కళాశాలల్లో చేరాలనే విద్యార్థులకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు నజరానా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొన్ని కళాశాలలు అడుగు ముందుకేసి ల్యాప్‌టాప్‌లు అందించినట్లు వినికిడి. ఈ మేరకు విద్యార్థుల నుంచి యాజమాన్యాలు ముందస్తుగా విద్యార్హత సర్టిఫికెట్లను తీసుకున్నారుు. ఈ వ్యవహారంలో దళారులు కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో పలు కళాశాలలకు అనుమతి రాకపోవడంతో సమస్య తలెత్తింది.
తంటాలు పడుతున్న విద్యార్థులు
తమ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలంటూ అనుమతి రాని కళాశాలలపై బాధిత విద్యార్థుల ఒత్తిళ్లు పెరిగాయి. నేడో రేపో అనుమతులు వస్తాయి.. ఆందోళన చెందొద్దని యా జమాన్యాలు దాటవేస్తుండడంతో విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. ఈనెల 23తో మొదటి దశ కౌన్సిలింగ్‌కు తేదీ ముగియనుండడంతోపాటు వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కావాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొం ది. ఇప్పటికీ సదరు కళాశాలలు సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయకుండా సతాయిస్తున్నాయని కొందరు విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో ఇలా వందలాది మంది విద్యార్థులు సంకటస్థితిని ఎదుర్కొంటున్నారని ఓ అధ్యాపకుడు తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులను కలిస్తే పరిస్థితి చక్కబడేదని.. ఈ సారి ఆ అవకాశం ఇవ్వకుండా చేస్తుండడంతో సమస్య ఉత్పన్న మవుతోందన్నారు.
కాగా, తమ సర్టిఫికెట్లు ఇవ్వాలని సదరు విద్యార్థులు గట్టిగా అడిగితే.. తాము ఇచ్చిన నజరానా, ల్యాప్‌టాప్‌లు తిరిగి ఇచ్చేయూలని కళాశాలల నిర్వాహకులు తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఇంట్లో చెప్పకుండా ఖర్చు పెట్టేయడంతో ఏంచేయూలో తోచక సదరు విద్యార్థులు తంటాలు పడుతున్నట్లు సమాచారం.