
బీసీ సంపన్న శ్రేణి అమలు
వేతనం, వ్యవసాయ ఆదాయం లేకుండా..
వార్షికాదాయం రూ. 6 లక్షలు దాటితే క్రీమీలేయర్ పరిధిలోకి..
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ
సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, వ్యవసాయ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రంలో బీసీ క్రీమీలేయర్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తయారుచేసిన మెమో (నెంబరు 3009/బీసీడబ్ల్యూ/ఓపీ/2009)ను ప్రభుత్వ (బీసీ సంక్షేమ శాఖ) ముఖ్య కార్యదర్శి రాధా జారీ చేశారు. వేతనాలు, వ్యవసాయ ఆదాయం మినహాయించి మిగతా మార్గాల్లో వచ్చే వార్షిక ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉన్నవారు బీసీ క్రీమీలేయర్ (బీసీ సంపన్న శ్రేణి) పరిధిలోకి రారని స్పష్టం చేశారు. సర్టిఫికె ట్లు జారీ చేసే సమయంలో వీటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. అంతేకాదు ప్రస్తుతం నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని.. ఇందుకోసం దాని ఫార్మాట్‌ను కూడా భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపిస్తున్నామని, ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
వివిధ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉంటే వారిని నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకొని బీసీ కోటాలో వారికి రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. అదే రూ. 6 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారిని వెనుకబడిన వర్గాల్లో సంపన్న శ్రేణులుగా గుర్తించి, ఓపెన్ కేటగిరీలోనే వారిని పరిగణనలోకి తీసుకుంటారు. బీసీలు అయినప్పటికీ రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంతర్జాతీయ సంస్థల్లో అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లోని అధికారులు, గ్రూపు-1, గ్రూపు-2 (క్లాస్ 1, క్లాస్ 2) అధికారులు, రూ. 6 లక్షలకు పైగా వార్షికాదాయం కలిగిన ఇతరుల పిల్లలంతా బీసీ క్రీమీలేయర్ పరిధిలోకే వస్తారని బీసీ సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఎట్టకేలకు నియామకాలకు మోక్షం
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్ల వర్తింపులో క్రీమీలేయర్‌ను అమలు చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే బీసీ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం క్రీమీలేయర్ అమలు చేయాలా? వద్దా? అన్నది పరిశీలిస్తామని పేర్కొంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టీఎస్‌పీఎస్‌సీ, టీఎస్‌జెన్‌కో వంటి సంస్థలు నాలుగు నెలల కిందటే అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు నిర్వహించాయి. ఇక అభ్యర్థులు బీసీల్లో సంపన్న శ్రేణి పరిధిలోకి రాకపోతే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ఆయా నోటిఫికేషన్లలోనే ప్రకటించాయి. అయితే టీఎస్‌పీఎస్సీ రెండు నెలల కిందటే వివిధ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా బీసీ క్రీమీలేయర్ అమలు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాక నియామకాలు చేపట్టలేదు. ఇక ఇంటర్వ్యూలు ఉన్న పోస్టులకు 1:2 చొప్పున అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. వాటికి క్రీమీలేయర్‌పై స్పష్టత అవసరం కావడంతో ఇంటర్వ్యూలకు మెరిట్ జాబితాలను సిద్ధం చేయలేదు.
నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు ఇవ్వాలి
ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో వివిధ పోస్టులకు ఎంపికయ్యే వారు బీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతోపాటు, సీసీఎల్‌ఏకు నాన్ క్రీమీలేయర్ ఫార్మాట్‌ను అందజేశారు. ఆ ఫార్మాట్ ప్రకారం రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది.