ప్రతీకాత్మక చిత్రం
నాగోలు: సర్టిఫికెట్లు అడిగినందుకు విద్యార్థినిపై, ఆమె చిన్నమ్మపై కళాశాల డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించడంతో కేసు నమోదైన ఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్‌బీనగర్‌లోని డాక్టర్ జీ మెడికల్ అండ్ ఐఐటీ అకాడమీలో కీర్తన అనే విద్యార్థిని గత రెండేళ్లుగా విద్యనభ్యసిస్తోంది. కళాశాల ఫీజు విషయంలో మేనేజ్‌మెంట్, విద్యార్థిని మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా.. “స్టడీ అవర్స్‌లో అకాడమీ డైరెక్టర్ జగన్ యాదవ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఇది తట్టుకోలేక హాస్టల్‌లోనే పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు.. ఇక ఈ కాలేజీలో చదవలేను.. నా సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికెళ్లిపోతాను’ అని విజ్ఞప్తి చేస్తే బెదిరింపులకు పాల్పడినట్లు విద్యారి్థని కీర్తన పేర్కొంది. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామనడంతో రూ.50 వేలు చెల్లించినట్లు.. అయినా ఇంటికి పంపకుండా అడ్డుకున్నారని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది.
తనను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన చిన్నమ్మ మమతను సైతం కళాశాల డైరెక్టర్ జగన్‌యాదవ్, డ్రైవర్ శివ అడ్డుకున్నారని, ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు హాస్టల్ గేటు దగ్గర దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని కీర్తన ఆరోపించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా సమయంలో హాస్టల్ మూసివేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి చిన్నమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్‌యాదవ్, శివపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎల్‌బీనగర్ పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment