
మీ షేర్లు పేపర్ల రూపంలో ఉన్నాయా?
ఎలక్ట్రానిక్ రూపంలోకి మారిస్తేనే అమ్మగలం ∙మార్చుకునే సమయంలో ఎన్నో పరిశీలనలు సంతకం సరిపోవాలి... పేర్లు కూడా మ్యాచ్ అవ్వాలి ∙లేదంటే అఫిడవిట్, నోటరీ సాయం అవసరం బెనిఫీషియరీ మరణిస్తే వారసుల పేరిట బదిలీ ∙అందుకోసం మరింత సుదీర్ఘ ప్రక్రియ
షేర్లు ఎన్ని ఉన్నా, ఎంత విలువైనవి అయినా ఎలక్ట్రానిక్ రూపంలో స్మార్ట్‌ఫోన్ నుంచే యాక్సెస్ చేసుకునే రోజులివి. కానీ, 20 ఏళ్ల క్రితం షేర్లన్నీ సర్టిఫికెట్ల రూపంలోనే ఉండేవి. 1996లో డిపాజిటరీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఎన్నో వ్యయ, ప్రయాసలు తప్పాయి. మరి 20, 30 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్ల పత్రాలు మీ దగ్గర ఇప్పటికీ ఉన్నాయా...? వాటిని తీరిగ్గా ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలోకి (డీమ్యాట్) మార్చుకోవాలని అనుకుంటున్నారా...? అయితే, ఇందులో ఉన్న సాధక బాధకాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి మరి. అలా చేస్తే అనవసర సమస్యలను ముందే నివారించుకోవచ్చు.
డీమ్యాట్ తప్పనిసరి...
షేర్లు ఎవరి పేరుతో అయితే ఉన్నాయో, వారి పేరిట డీమ్యాట్ ఖాతా కలిగి ఉండడం తప్పనిసరి. లేదంటే కొత్తగా డీమ్యాట్ ఖాతా తెరవాలి. స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, బ్యాంకుల ద్వారా డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు వీలుంది. ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ సంస్థల తరఫున డీమ్యాట్ ఖాతాలను అన్ని బ్రోకింగ్ సంస్థలూ అందిస్తున్నాయి. ఖాతా తెరిచిన తరవాత డిపాజిటరీ పార్టిసిపెంట్లకు (డీపీ) డీమ్యాట్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. డీఆర్‌ఎఫ్‌ను పూరించి షేర్ల సర్టిఫికెట్లను జత చేసి డీపీకి అందించిన తర్వాత... డీపీ వాటిని సంబంధిత కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లకు పంపిస్తుంది.
సంతకాలు సరిపోలకుంటే...?
సాధారణంగా డీమ్యాట్ దరఖాస్తుల్లో ఎక్కువగా ఎదురయ్యే సమస్య సంతకాలు సరిపోలకపోవడమే. షేర్ల కొనుగోలు సమయంలో దరఖాస్తులో చేసిన సంతకానికి, తాజా డీమ్యాట్ దరఖాస్తులో ఉన్న సంతకానికి మధ్య తేడాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న వాటితో ఈ సమస్య ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో ఆర్‌టీఏ పంపిన అఫిడవిట్ పత్రాన్ని బెనిఫీషియరీ పూర్తి చేసి, దాన్ని బ్యాంక్ మేనేజర్‌తో అటెస్టేషన్ చేయించి, అదనంగా బెనిఫీషియరీ గుర్తింపు పత్రం (ఆధార్/పాన్ కార్డు/పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒకటి) జతచేసి తిరిగి పంపాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతాకు అనుసంధానమై ఉన్న బ్యాంకు శాఖ మేనేజర్‌తో అటెస్టేషన్ చేయిస్తేనే చెల్లుబాటు అవుతుంది.
పేరులో తేడాలుంటే...
షేర్ సర్టిఫికెట్‌పై ఉన్న పేరుకు, డీమ్యాట్ ఖాతాలో ఉన్న బెనిఫీషియరీ పేరుకు మధ్య స్వల్ప తేడా ఉన్నా ఇటువంటి ప్రక్రియనే అనుసరించాల్సి వస్తుంది. ఉదాహరణకు స్వామి సుందర్ అని డీమ్యాట్ ఖాతాలో ఉందనుకుందాం. షేర్ల సర్టిఫికెట్‌పై ఎస్.సుందర్ అని ఉంటే ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడానికి ముందు... ఆర్టీఏ మరింత స్పష్టత కోరతారు. ఇటువంటి సందర్భాల్లోనూ బెనిఫీషియరీకి అఫిడవిట్ పంపడం జరుగుతుంది. ఆ అఫిడవిట్‌ను పూర్తి చేసి దాన్ని నోటరీతో అటెస్టేషన్ చేయించిన అనంతరం, గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి వెనక్కి పంపాలి.
ఉమ్మడి భాగస్వామ్యంతో ఉంటే...
తమ దగ్గరున్న షేర్ల సర్టిఫికెట్లు ఉమ్మడి భాగస్వామ్యం (జాయింట్ హోల్డర్) లోనివి అయితే అప్పుడు ఉమ్మడిగా జాయింట్ డీమ్యాట్ ఖాతా తెరిచి ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని కోరుతూ అభ్యర్థన పంపవచ్చు. అలాగని జాయింట్ ఖాతానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. జాయింట్ షేర్ సర్టిఫికెట్లలో ఇద్దరు బెనిఫీషియరీలు ఉంటే, వారిలో ఎవరో ఒకరి పేరు మీదకు అయినా వాటిని డీమ్యాట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కాకపోతే ఇందుకు గాను ట్రాన్స్‌ఫర్ డీడ్ పత్రాన్ని పూర్తి చేసి పంపాలి. ఇటువంటి సందర్భాల్లో 0.25 శాతం స్టాంప్ డ్యూటీ (సంబంధిత షేర్ల మార్కెట్ విలువపై) విధించడం జరుగుతుంది. అయితే, ఇలా ట్రాన్స్‌ఫర్ డీడ్ రూపంలో కంటే ఉమ్మడిగా డీమ్యాట్ ఖాతా తెరిచి షేర్ల సర్టిఫికెట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవడమే ఉత్తమం.
ఎలక్ట్రానిక్ రూపంలోకి ఇలా...
ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని కోరుతూ తమ వద్దకు వచ్చిన షేర్ల పత్రాలను కంపెనీ రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (ఆర్‌టీఏ) క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కంపెనీ రికార్డుల్లో బెనిఫీషియరీ (షేర్ల హక్కుదారుడు) సంతకంతో, తమకు అందిన దరఖాస్తులోని సంతకాలను పోల్చి చూస్తారు. జాయింట్ హోల్డర్ అయితే, ఆ వివరాలను కూడా పరిశీలిస్తారు. అలాగే, ఆ షేర్లను అప్పటికే ఎక్కడైనా తాకట్టు పెట్టి ఉన్నారా? ఆ షేర్లకు సంబంధించి ఏవైనా కోర్టు కేసులు ఉన్నాయా? అవి ఫోర్జరీ చేసినవా? ఇలా అన్ని అంశాలను సరిచూస్తారు. ఒకవేళ మీ దగ్గరున్న షేర్ సర్టిఫికెట్ల తాలూకూ కంపెనీ మరేదైనా కంపెనీలో విలీనమై ఉంటే, ఆ కంపెనీని వేరే కంపెనీ కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు మనుగడలో ఉన్న కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లకు వివరాలు అందించాల్సి ఉంటుంది.
రవాణాలో సర్టిఫికెట్లు పోతే..?
షేర్ల డీమ్యాట్ ప్రక్రియలో భాగంగా షేర్ల సర్టిఫికెట్లు పోతే అందుకు కంగారుపడాల్సిన పనిలేదు. డీపీ ఆ బాధ్యత తీసుకుంటుంది. రవాణాలో షేర్ల సర్టిఫికెట్లు పోయినా, వాటికి నష్టం జరిగినా డీపీ నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది.
లబ్దిదారు మరణించి ఉంటే...?
ఇంట్లో షేర్ల సర్టిఫికెట్లు ఉన్నా కానీ దాని యజమాని అప్పటికే మరణించి ఉండొచ్చు. ఆ షేర్లకు ఉమ్మడి భాగస్వామి కూడా లేకపోవచ్చు. ఇలాంటప్పుడు వారసుల్లో (జీవిత భాగస్వామి లేదా కుమారుడు లేదా కుమార్తె) ఒకరు తమ పేరిట షేర్లను మార్చుకునేందుకు హక్కు ఉంటుంది. ఆర్‌టీఏ ఆమోదం అనంతరం సంబంధిత షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చి వారసుల డీమ్యాట్ ఖాతాలో జమ చేస్తారు. ఆర్‌టీఏ ఆమోదం కోసం బెనిఫీషియరీ మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ పత్రం, కోర్టు అధికారి అటెస్ట్ చేసిన దర్యాప్తు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ రూపంలో ఉన్న షేర్ల విలువ భారీ మొత్తంలో ఉంటే ఆర్‌టీఏ వాటిని వారసులకు బదిలీ చేయడానికి గాను మరిన్ని అదనపు పత్రాలను కూడా కోరే అవకాశం ఉంటుంది. బెనిఫీషియరీకి ఒకటికి మించిన కంపెనీల్లో వాటాలు ఉంటే అప్పుడు వాటిని ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకునేందుకు గాను ప్రతీ కంపెనీకి విడివిడిగా వీటిని పంపాల్సి వస్తుంది.
డీమ్యాట్ రూపంలో ఉన్నపుడు...
డీమ్యాట్ ఖాతా ఒక్కరి పేరిటే ఉండి, దాని యజమాని మరణించిన సందర్భాల్లో నామినీగా ఉన్న వారు బదిలీ పత్రం, డీమ్యాట్ ఖాతాదారుడు మరణించినట్టు నోటరీ ధ్రువీకరణ సమర్పిస్తే చాలు. ట్రాన్సిమిషన్ పత్రం డీపీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివరాల పరిశీలన తర్వాత డీపీ సంబంధిత ఖాతాలోని షేర్లను నామినీ ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఒకవేళ నామినీగా ఎవరి పేరునూ నమోదు చేసి లేకుంటే చట్టబద్ధమైన వారసులు ఎన్‌వోసీ, కుటుంబ ఒప్పంద పత్రం తదితర అన్ని వివరాలను సమర్పించడం ద్వారా వాటిని పొందవచ్చు. ఇక జాయింట్ డీమ్యాట్ ఖాతా అయితే, అందులో ఒక బెనిఫీషియరీ మరణిస్తే, జీవించి ఉన్న వారు ట్రాన్సిమిషన్ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.