
అందరిలోనూ అభద్రతే..!
జిల్లా అంతటా ఒకే చర్చ... ఆహార భద్రతా కార్డులు, పింఛన్లు వస్తాయో..? లేదోననే ఆందోళన. బోగస్ ఏరివేతలో భాగంగా టీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు..
- బోగస్ తొలగింపు లక్ష్యంగా సర్కార్ ముందడుగు
- ‘ఆహార భద్రత’తో భారీగా రేషన్ కార్డుల కోత
- వితంతు పింఛన్లకు మరణ ధ్రువీకరణ తప్పనిసరి..?
- సదరం సర్టిఫికెట్లు ఉంటేనే వైకల్య పింఛన్లు
- ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు
సాక్షి, మంచిర్యాల : జిల్లా అంతటా ఒకే చర్చ... ఆహార భద్రతా కార్డులు, పింఛన్లు వస్తాయో..? లేదోననే ఆందోళన. బోగస్ ఏరివేతలో భాగంగా టీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు.. అనుసరిస్తున్న విధానాలు.. వివరాల సేకరణ లబ్ధిదారుల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. స్లాబుతో కూడిన మూడు గదులున్నా, ఇంట్లో కారున్నా ఆహార భద్రత కార్డులివ్వబోమని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం వితంతు పింఛన్లు పొందాలంటే లబ్ధిదారులు తమ వాళ్ల మరణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించింది. సదరం ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారికే వికలాంగ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించి.. ఈ నెల 8 నుంచి 20 వరకు ఆహార భద్రతా కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. మరోపక్క.. పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ క్షేత్రస్థాయిలో ప్రారంభమైంది. విచారణ సిబ్బంది ఇంటింటికీ తిరిగి.. లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 30లోగా వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ప్రక్రియ పూర్తయితే.. ఇప్పటి వరకు జిల్లాలో భారీ సంఖ్యలో బోగస్ కార్డులకు కోత పడనుంది.
లబ్ధిదారుల్లో ఆందోళన..!
విచారణ చేపడుతున్న సిబ్బంది స్లాబుతో కూడిన సొంతిల్లు ఉంటే ఆహార భద్రతా కార్డులు రావని ముందే చెప్పేస్తున్నారు. వితంతువు పింఛన్ దరఖాస్తుదారుల నుంచి మరణ ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారు. పదేళ్ల క్రితమే తమ భర్తలు చనిపోయారని.. ఆ సమయంలో వారి మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేదని ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని వితంతువులు విచారణ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి వివరణ ఇస్తూ.. ప్రస్తుతం వితంతు పింఛన్ల కోసం మరణ ధ్రువీకరణ పత్రాలు అడగడం లేదని.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు అలాంటి ఇబ్బంది కలగకుండా పింఛన్లు అందజేస్తామన్నారు. ఇటు సదరం సర్టిఫికెట్లు లేకుండా పిం ఛన్లు పొందుతున్న వారు వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేక సర్వే సిబ్బందితో మొరపెట్టుకుంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో సర్వే సిబ్బంది లబ్ధిదారులు చెబుతున్న వివరాలు కాకుండా తాము గమనించిన విషయాలూ నమోదు చేసుకోవడంతో దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంచిర్యాల పట్టణం ఇస్లాంపురాలో విచారణకు వచ్చిన సిబ్బంది అర్హత కలిగిన పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆహార భద్రతా కార్డులకు మీరు అనర్హులని చెప్పడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
దరఖాస్తు గడువు పెంపు డిమాండ్..!
ఇప్పటి వరకున్న రేషన్‌కార్డుల స్ధానంలో ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం కొత్త కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 8 నుంచి 15 వరకు మండల, తహశీల్ కార్యాలయాల్లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయినా చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో గడువు తేదీని 20 వరకు పొడిగించారు. దరఖాస్తులు చేసుకోవాల్సిన వారు ఇంకా మిగిలే ఉన్నారు.
దీంతో వీరందరూ గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క.. ఇటీవల రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ దరఖాస్తు ప్రక్రియ నిరంతరమన్నారు. ఈ విషయంలో ఇంత వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. వచ్చే నెల 8 తేదీ నుంచేమో కొత్త వికలాంగ పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో సదరం సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారులు ఎగబడుతున్నారు.