
న్యూఢిల్లీ: ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో భాగంగా తొలిసారి.. 14 మందికి భారత పౌరసత్వం సర్టిఫికెట్‌ను బుధవారం అందజేసింది.
సీఏఏ చట్టం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతలో భాగంగా 14 మందికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. సీసీఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
కాగా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. 2014 డిసెంబర్ 31కు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు దీనికి అర్హులని కేంద్రం పేర్కొంది. అలాగే అర్హత వ్యవధిని 11 నుంచి 5 సంవత్సరాలకు తగ్గించింది.
2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. అనంతరం దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు. సీఏఏ అమలుపై గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత పౌరసత్వం మంజూరుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది.