
అరబ్ దేశాలు, వాటికి సహకరిస్తున్న కొన్ని దేశాలను పిలవొద్దన్న కేంద్రం
ఇటీవల కేంద్ర మంత్రి జైశంకర్‌ను కలసి ‘రైజింగ్’కు అనుమతి కోరిన సీఎం రేవంత్
కొన్ని దేశాలు వస్తే ప్రతికూల సంకేతాలు వెళతాయన్న కేంద్రం
వారిని మినహాయించి, మిగతా వారితో ‘రైజింగ్’జరుపుకోమని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’(తెలంగాణ రైజింగ్)కు కొన్ని దేశాల వారిని పిలవొద్దని కేంద్రం ఆంక్షలు విధించింది. అరబ్‌దేశాలు, ఆ దేశాలకు సహకరిస్తున్న మరికొన్ని దేశాల వారిని పిలవకుండా రైజింగ్ జరుపుకోమని సూచనలు చేసింది. ఆయా దేశాల ప్రతినిధులు భారత్‌కు వస్తే సంకేతాలు మరోలా బయటకు వెళతాయనే ఆలోచనతోనే తాము వద్దు అంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌కు.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన వివిధ దేశాల పేర్లు తొలగించి, కొత్త పేర్లతో మరో లేఖ ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది.
మీ ఆలోచన మంచిదే.. కానీ వాళ్లు వద్దు
‘రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవండి. ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’కు పలు దేశాల వారిని పిలవాలని అనుకుంటున్నాం. దీనికి మీ మద్దతు, అనుమతి అవసరం’అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను సీఎం రేవంత్ కోరారు. ఈ నెల 13న ఢిల్లీలో జైశంకర్‌ను కలసి అందుకు సంబంధించిన లేఖను అందచేశారు.
ఆ లేఖలో పలు దేశాల పేర్లు పొందుపరిచారు. కాగా, ‘తెలంగాణ రైజింగ్ పేరుతో మీరు నిర్వహించ తలపెట్టిన భారత్ సమ్మిట్ అభినందనీయం. మీఆలోచన మంచిదే.. అయితే, వీటిలో ఉన్న అరబ్ దేశాలు, అరబ్ దేశాలకు సహకరిస్తున్న కొన్ని దేశాల పేర్లు తొలగించండి. వాళ్లు భారత దేశానికి రావడం మాకు ఇష్టం లేదు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఏదైనా మాట్లాడితే, భారత్‌తో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయి. కాబట్టి, ఆయా దేశాల పేర్లు తొలగించి మీరు ఏ కార్యక్రమమైనా పెట్టుకోండి, మాకేమీ ఇబ్బంది లేదు’అంటూ సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి జైశంకర్ బదులిచ్చారు.
ఆ దేశాల పేర్లు తొలగించకపోతే కష్టమే?
ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య, అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య, మయన్మార్‌లో అంతర్గతంగా కొంతకాలంగా యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దేశాలకు కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుండగా, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో యుద్ధాలు జరిగే దేశాలు, వాటికి సహకరిస్తున్న దేశాల వారిని భారత్‌కు పిలవడం మనకు నష్టమని కేంద్రం భావిస్తోంది. వారిని మినహాయించి ఎవరు వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని కేంద్రం చెబుతున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గొప్పతనం చాటిచెప్పాలని, అందుకే ఆయా దేశాల వారిని ఇక్కడకు ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. సీఎం ఆలోచన మంచిదే అయినప్పటికీ కేంద్రానికి మాత్రం కొన్ని దేశాల వాళ్లు ఈ తరుణంలో ఇక్కడకు రావడం ఇష్టం లేదని, ఆ దేశాల పేర్లు తొలగించి కొత్తగా పేర్లు ఇస్తే అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. లేనిపక్షంలో తెలంగాణలో భారత్ సమ్మిట్ జరగడం కష్టమేనని కేంద్ర సర్వీసుల్లోని అధికారులు అంటున్నారు.