ఢిల్లీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 17–22 వరకు...
భారత్ మొబిలిటీ షోలో భాగంగా ఏర్పాటు
28 దేశ, విదేశీ వాహన సంస్థల క్యూ...
ఇటీవలి ‘బిగ్ 5’ గ్లోబల్ ఆటో షోల కంటే భారీగా...
మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు అరంగేట్రం
అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో షోకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్ మొబిలిటీ షోలో భాగంగా జరగనున్న వాహన ప్రదర్శన కోసం దేశ, విదేశీ దిగ్గజాలన్నీ క్యూ కడుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన బిగ్–5 ప్రపంచ వాహన ప్రదర్శనలను తలదన్నేలా ఢిల్లీ ఆటో ఎక్స్‌పో కనువిందు చేయనుంది!
దేశంలో మరో వాహన జాతరకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ కొంగొత్త మోడళ్లను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్... మారుతీ సుజుకీ నుంచి గ్లోబల్ కంపెనీలు టయోటా, చైనా బీవైడీ వరకు దాదాపు 28 కంపెనీలు తమ కొత్త వాహన ఆవిష్కరణలతో సందర్శకులను అలరించనున్నాయి. దేశంలో తొలిసారిగా ఆటో షోతో పాటు దీనికి అనుబంధంగా పలు ప్రదర్శనలను కలిపి భారత్ మొబిలిటీ షో–2025 పేరుతో నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 17–22 వరకు జరగనున్న ఆటో ఎక్స్‌పో ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత్ మండపం ఈ కార్ల మేళాతో భారత్ సత్తాను చాటిచెప్పనుంది.. ముఖ్యంగా ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలపైనే కంపెనీలన్నీ మరింత ఫోకస్ చేస్తుండటం విశేషం. 2023లో జరిగిన ఆటో షోతో పోలిస్తే రానున్న షో నాలుగు రెట్లు పెద్దది. అంతేకాదు 1986లో దేశంలో మొదలైన ఆటో ఎక్స్‌పో నుంచి చూస్తే.. 2025 షో కనీవినీ ఎరుగని స్థాయిలో చరిత్ర సృష్టించనుంది.
డెట్రాయిట్, జెనీవా దిగదుడుపే...!
ఈసారి ఆటో షో.. విదేశాల్లో పేరొందిన ప్రదర్శనలన్నింటినీ మించిపోయే రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జెనీవా, మ్యూనిక్, డెట్రాయిట్, పారిస్, టోక్యో ఆటో ఎక్స్‌పోలను ‘బిగ్–5’గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో ఇక్కడ పాల్గొంటున్న కంపెనీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అధిక వ్యయాలు, సందర్శకులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. మ్యూనిక్ ఆటో షోలో 13 కార్ల కంపెనీలు పాల్గొనగా... ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జెనీవా షోలో 20 వాహన సంస్థలు పాలు పంచుకున్నాయి. ఇక పారిస్‌లో 11, టోక్యోలో 22 కంపెనీలు కొత్త ఆవిష్కరణలు చేశాయి.
గతేడాది జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో 13 కంపెనీలు 35 వాహన బ్రాండ్‌లను ప్రదర్శించాయి. కాగా, రాబోయే మన ఆటో ఎక్స్‌పోలో 16 కార్ల కంపెనీలు, 6 వాణిజ్య వాహన తయారీదారులు, 6 ద్విచక్ర వాహన సంస్థలు.. వెరసి 28 సంస్థలు అదరగొట్టేందుకు సై అంటున్నాయి. గత ఎడిషన్ (2023)కు దూరంగా ఉన్న హీరో మోటో, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, స్కోడా తదితర కంపెనీలు మళ్లీ తిరిగొస్తున్నాయి. మరోపక్క, ఈసారి అర డజను కొత్త కంపెనీలు రంగంలోకి దూకుతున్నాయి. ఇందులో వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్, టీఐ క్లీన్ మొబిలిటీ, పోర్‡్ష తదితర కంపెనీలు ఉన్నాయి.
వీటిపై ఫోకస్
మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రి్టక్ ఎస్‌యూవీ
వియత్నాం కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
వేవ్ మొబిలిటీ భారత్‌లో తొలి సోలార్ ఎలక్ట్రిక్ కారు
ఈవీల హల్‌చల్..
గత షోలో కంపెనీల సంఖ్య తగ్గినప్పటికీ 75 వాహనాలను ఆవిష్కరించారు. ఈసారి కొత్త మోడళ్లతో పాటు ఆవిష్కరణలు గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ ఈవీ రంగంలో తన తొలి మోడల్‌ను ప్రపంచానికి చూపనుంది. టాటా మోటార్స్ సైతం కొత్త ఈవీలను ప్రదర్శించనుంది. వియత్నాం ఈవీ తయారీదారు విన్‌ఫాస్ట్ కార్లు కూడా షో కోసం ఫుల్ చార్జ్ అవుతున్నాయి.
మన మార్కెట్ రయ్ రయ్...
ఈ ఏడాది మన వాహన మార్కెట్ కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ.. ప్రపంచ టాప్–10 ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యంత వేగవంతంమైన వృద్ధితో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ప్రధాన వాహన మార్కెట్లలో ఒక్క భారత్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే 2019 ముందు నాటి కోవిడ్ ముందస్తు స్థాయి అమ్మకాలను చేరుకోగలిగాయి. అత్యంత కీలక ఆటోమొబైల్ మార్కెట్లయిన అమెరికా, జర్మనీ, జపాన్‌లో 2019 నాటి ఉత్పత్తి కోవిడ్ ముందు స్థాయిని అందుకోలేకపోవడం గమానార్హం. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉంది. ఇది వాహన కంపెనీలకు అపారమైన అవకాశాలను షృష్టించనుంది. అంతేకాదు, దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే కావడం, తలసరి ఆదాయం (ప్రస్తుతం దాదాపు 2000 డాలర్లు. 2030 కల్లా 5,000 డాలర్లను చేరుతుందని అంచనా) పెరుగుతుండటం కూడా సానుకూలాంశం!
Comments
Please login to add a commentAdd a comment