International Automobile Federation
-
మెగా ఆటో షో!
అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో షోకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్ మొబిలిటీ షోలో భాగంగా జరగనున్న వాహన ప్రదర్శన కోసం దేశ, విదేశీ దిగ్గజాలన్నీ క్యూ కడుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన బిగ్–5 ప్రపంచ వాహన ప్రదర్శనలను తలదన్నేలా ఢిల్లీ ఆటో ఎక్స్పో కనువిందు చేయనుంది!దేశంలో మరో వాహన జాతరకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ కొంగొత్త మోడళ్లను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్... మారుతీ సుజుకీ నుంచి గ్లోబల్ కంపెనీలు టయోటా, చైనా బీవైడీ వరకు దాదాపు 28 కంపెనీలు తమ కొత్త వాహన ఆవిష్కరణలతో సందర్శకులను అలరించనున్నాయి. దేశంలో తొలిసారిగా ఆటో షోతో పాటు దీనికి అనుబంధంగా పలు ప్రదర్శనలను కలిపి భారత్ మొబిలిటీ షో–2025 పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 17–22 వరకు జరగనున్న ఆటో ఎక్స్పో ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత్ మండపం ఈ కార్ల మేళాతో భారత్ సత్తాను చాటిచెప్పనుంది.. ముఖ్యంగా ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలపైనే కంపెనీలన్నీ మరింత ఫోకస్ చేస్తుండటం విశేషం. 2023లో జరిగిన ఆటో షోతో పోలిస్తే రానున్న షో నాలుగు రెట్లు పెద్దది. అంతేకాదు 1986లో దేశంలో మొదలైన ఆటో ఎక్స్పో నుంచి చూస్తే.. 2025 షో కనీవినీ ఎరుగని స్థాయిలో చరిత్ర సృష్టించనుంది. డెట్రాయిట్, జెనీవా దిగదుడుపే...!ఈసారి ఆటో షో.. విదేశాల్లో పేరొందిన ప్రదర్శనలన్నింటినీ మించిపోయే రేంజ్లో ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జెనీవా, మ్యూనిక్, డెట్రాయిట్, పారిస్, టోక్యో ఆటో ఎక్స్పోలను ‘బిగ్–5’గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో ఇక్కడ పాల్గొంటున్న కంపెనీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అధిక వ్యయాలు, సందర్శకులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. మ్యూనిక్ ఆటో షోలో 13 కార్ల కంపెనీలు పాల్గొనగా... ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జెనీవా షోలో 20 వాహన సంస్థలు పాలు పంచుకున్నాయి. ఇక పారిస్‌లో 11, టోక్యోలో 22 కంపెనీలు కొత్త ఆవిష్కరణలు చేశాయి. గతేడాది జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో 13 కంపెనీలు 35 వాహన బ్రాండ్లను ప్రదర్శించాయి. కాగా, రాబోయే మన ఆటో ఎక్స్‌పోలో 16 కార్ల కంపెనీలు, 6 వాణిజ్య వాహన తయారీదారులు, 6 ద్విచక్ర వాహన సంస్థలు.. వెరసి 28 సంస్థలు అదరగొట్టేందుకు సై అంటున్నాయి. గత ఎడిషన్ (2023)కు దూరంగా ఉన్న హీరో మోటో, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, స్కోడా తదితర కంపెనీలు మళ్లీ తిరిగొస్తున్నాయి. మరోపక్క, ఈసారి అర డజను కొత్త కంపెనీలు రంగంలోకి దూకుతున్నాయి. ఇందులో వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్, టీఐ క్లీన్ మొబిలిటీ, పోర్‡్ష తదితర కంపెనీలు ఉన్నాయి.వీటిపై ఫోకస్మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రి్టక్ ఎస్యూవీ వియత్నాం కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు వేవ్ మొబిలిటీ భారత్‌లో తొలి సోలార్ ఎలక్ట్రిక్ కారు ఈవీల హల్చల్.. గత షోలో కంపెనీల సంఖ్య తగ్గినప్పటికీ 75 వాహనాలను ఆవిష్కరించారు. ఈసారి కొత్త మోడళ్లతో పాటు ఆవిష్కరణలు గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ ఈవీ రంగంలో తన తొలి మోడల్‌ను ప్రపంచానికి చూపనుంది. టాటా మోటార్స్ సైతం కొత్త ఈవీలను ప్రదర్శించనుంది. వియత్నాం ఈవీ తయారీదారు విన్‌ఫాస్ట్ కార్లు కూడా షో కోసం ఫుల్ చార్జ్ అవుతున్నాయి.మన మార్కెట్ రయ్ రయ్... ఈ ఏడాది మన వాహన మార్కెట్ కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ.. ప్రపంచ టాప్–10 ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యంత వేగవంతంమైన వృద్ధితో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ప్రధాన వాహన మార్కెట్లలో ఒక్క భారత్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే 2019 ముందు నాటి కోవిడ్ ముందస్తు స్థాయి అమ్మకాలను చేరుకోగలిగాయి. అత్యంత కీలక ఆటోమొబైల్ మార్కెట్లయిన అమెరికా, జర్మనీ, జపాన్‌లో 2019 నాటి ఉత్పత్తి కోవిడ్ ముందు స్థాయిని అందుకోలేకపోవడం గమానార్హం. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉంది. ఇది వాహన కంపెనీలకు అపారమైన అవకాశాలను షృష్టించనుంది. అంతేకాదు, దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే కావడం, తలసరి ఆదాయం (ప్రస్తుతం దాదాపు 2000 డాలర్లు. 2030 కల్లా 5,000 డాలర్లను చేరుతుందని అంచనా) పెరుగుతుండటం కూడా సానుకూలాంశం! -
నగరానికి దక్కిన ‘భాగ్యం’
సాక్షి క్రీడా విభాగం: అక్టోబర్ 7, 2022... హైదరాబాద్‌లో ఫార్ములా ‘ఇ’ రేస్ నిర్వహించబోతున్నట్లు తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన రోజు... ఇప్పుడు సరిగ్గా నాలుగు నెలల తర్వాత వచ్చిన స్పందనను చూస్తే ఈ రేసింగ్ ఈవెంట్ ఎంతగా సక్సెస్ అయ్యిందో అర్థమవుతుంది. ఫార్ములా ‘ఇ’ పోటీలను నిర్వహించే అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) కూడా హైదరాబాద్ పోటీలపై తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఫార్ములా ‘ఇ’ చరిత్రలో అత్యుత్తమ రేస్‌లలో ఒకటిగా ప్రకటించింది. హైదరాబాద్‌లో ‘ఇ’ రేసు జరుగుతుందని ప్రకటించిన సమయంలో ఇది సఫలం కావడంపై అనేక సందేహాలు కనిపించాయి. నగరం నడిబొడ్డున ‘స్ట్రీట్ సర్క్యూట్’ ట్రాక్‌ను సిద్ధం చేయడం అన్నింటికంటే పెద్ద సవాల్‌గా నిలిచింది. అత్యంత వేగంగా ఈ పనులు పూర్తి చేసిన అధికారులు హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్, ఐమ్యాక్స్ పరిసరాలను రేసింగ్ కార్లకు అనుగుణంగా మార్చారు. అయితే గత నవంబర్‌లో దీనికి సన్నాహకంగా నిర్వహించిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ఆశించిన స్థాయిలో సఫలం కాలేదు. దానికి స్పందన గొప్పగా లేకపోగా, ఏర్పాట్లలో సాగిన లోపాలు, ట్రాక్‌పై డ్రైవర్ల అసంతృప్తి, రేస్‌ల వాయిదాలు వెరసి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో ఫార్ములా ‘ఇ’ నిర్వహణపై కూడా కొంత అపనమ్మకం వచ్చింది. అయితే ఎఫ్ఐఏ నేరుగా ట్రాక్ ఏర్పాటు అంశంలో భాగస్వామిగా మారి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయించగలిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కీలకంగా ఉన్న, ఫార్ములా ‘ఇ’ రేసింగ్‌లో జట్టు ఉన్న ‘మహీంద్రా’ కూడా సహభాగస్వామిగా భారత్‌లో తొలి రేసును విజయవంతం చేయడంలో చురుగ్గా పాల్గొంది. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు, వాటిలో వచ్చిన ఇక్కట్లతో సామాన్యుల్లో తీవ్ర అసహనం కనిపించింది. శుక్రవారం ట్రాక్‌లోకి సాధారణ వాహనాలు దూసుకురావడం కూడా కొంత ఆందోళన రేపిన అంశం. అయితే సరైన సమయంలో స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల అసంతృప్తిని సాధ్యమైనంతగా తగ్గించే ప్రయత్నం చేశారు. చివరకు అభిమానులు కూడా ఆసక్తిగా పెద్ద ఎత్తున హాజరు కావడం, తమ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ ఈవెంట్‌గా దానికి తగిన విలువ ఇవ్వడంతో ఇది సక్సెస్‌గా నిలవగలిగింది. భారత్‌లో ఢిల్లీ, ముంబైలాంటి నగరాలను కాదని హైదరాబాద్‌లో జరిగిన ‘ఇ’ రేసింగ్‌కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కావడం కూడా దీనికి గల స్థాయిని చూపించింది. మొత్తంగా ఎఫ్ఐఏ కూడా సౌకర్యాలు, ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం ఫార్ములా ‘ఇ’ రేసింగ్‌కు సంబంధించి పెద్ద సానుకూలాంశం. తాజా సీజన్లో ప్రపంచవ్యాప్తంగా మరో 12 రేస్‌లు మిగిలి ఉన్నాయి. వచ్చే ఏడాది వేదికపై ఇంకా స్పష్టత లేకున్నా... వచ్చే సీజన్లో కూడా హైదరాబాద్ మళ్లీ ఆతిథ్యం ఇవ్వడం పాటు శాశ్వత వేదికగా కూడా మారే అవకాశం ఉంది. -
ఇదీ ఇ–ఫార్ములా...రేసింగ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్
దాదాపు పుష్కరకాలం క్రితం భారత్‌లో ప్రతిష్టాత్మక ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ వచ్చింది. మూడేళ్లు ఢిల్లీ బుధ్ సర్క్యూట్లో కార్లు దూసుకుపోయిన తర్వాత వేర్వేరు కారణాలతో ఎఫ్1 నిర్వాహకులు భారత్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సరిగ్గా పదేళ్ల క్రితం అదే అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) మన దేశంలో మరో రేసింగ్ ఈవెంట్‌కు అనుమతి ఇచ్చింది. అయితే దేశంలోనే ఇతర ప్రధాన నగరాలను కాదని ఫార్ములా–ఇ రేసింగ్‌కు వేదికగా మన హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం. భారత్‌లో జరగబోతున్న ఈ తొలి రేస్ గత కొంత కాలంగా అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. హుస్సేన్ సాగర్ తీరాన ఈ వారాంతంలో అలా జూమ్మంటూ రేసింగ్ కార్లు సందడి చేయనున్న నేపథ్యంలో ఇ–ఫార్ములా విశేషాలు... సాక్షి, హైదరాబాద్: రేసింగ్ ప్రపంచంలో ఫార్ములావన్ అన్నింటికంటే పెద్ద ఈవెంట్. ఎఫ్1 కార్లు పెట్రోల్‌తో పని చేస్తాయి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇదే తరహాలో ఎలక్ట్రిక్ కార్లతో కూడా రేస్‌లు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) అధికారి కంగా ముందుకొచ్చింది. కాలుష్య నివారణకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇలాంటి కార్లను ప్రోత్సహించాలనే ఉద్దేశం కూడా వీటి ప్రారంభానికి కారణం. దాంతో 2014లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జరగబోతున్న ఫార్ములా–ఇ సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్‌లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయి ఈవెంట్. పర్యావరణహితం అంటూ ‘గో గ్రీన్’ పేరుతో ఈ రేసింగ్‌లను ఆయా దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ► ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు ఫార్ములా–ఇ పోటీలను నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్నది 9వ సీజన్. ఈ సీజన్లో మొత్తం 16 రేస్‌లు జరగనుండగా... హైదరాబాద్‌లో నాలుగోది నిర్వహిస్తున్నారు. తొలి మూడింటికి మెక్సికో సిటీ, దిరియా (సౌదీ అరేబియా–2 రేస్‌లు) ఆతిథ్యమిచ్చాయి. కేప్‌టౌన్, సావోపాలో, బెర్లిన్, మొనాకో, జకార్తా, పోర్ట్లాండ్, రోమ్, లండన్లలో తర్వాత రేస్‌లు జరుగుతాయి. ► ఎఫ్1లో ఉండే ప్రత్యేక సర్క్యూట్లతో పోలిస్తే ఫార్ములా–ఇ పోటీలు అన్నింటికీ దాదాపుగా జనావాసం మధ్యలో ఉండే ‘స్ట్రీట్ సర్క్యూట్‘లలో నే జరుగుతాయి. హైదరాబాద్‌లో కూడా నగరం మధ్యలో హుస్సేన్‌సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించేందుకు ఇదే ప్రధాన కారణం. ‘గ్రీన్కో’ సంస్థ ఈ ఈవెంట్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ► ఫార్ములా–ఇ కార్ల గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. గత ఎనిమిది సీజన్లతో పోలిస్తే ఈసారి కొత్తగా జెన్3 (జనరేషన్ 3) కార్లను ఉపయోగిస్తున్నారు. జెన్ 3 బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో ఉంటాయి. పనితీరు, సామర్థ్యంలో ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్లలో ఇవే అత్యుత్తమం. ఇందులో 40 శాతం వరకు ఎనర్జీ కేవలం బ్రేక్‌లు వాడటం ద్వారానే ‘రీజనరేటివ్’తో ఉత్పత్తి అవుతుంది. రబ్బర్, రీసైకిల్డ్ ఫైబర్లనే టైర్ల తయారీలో వాడతారు. కాలుష్యరహితంగా, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొనే ఈ కార్లను తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చెవులు చిల్లులు పడే ఎఫ్1 కార్ల శబ్దంతో పోలిస్తే తక్కువ డెసిబుల్స్‌తో ఈ కార్లు పరుగు తీస్తాయి. ► ఫార్ములా–ఇ జట్లలో ఎక్కువ భాగం టీమ్‌లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు చెందినవే ఉన్నాయి. భారత్‌కు చెందిన మహీంద్ర మోటార్స్ కూడా అలాంటిదే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇ–రేసింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఎఫ్1 దిగ్గజాలైన మెక్లారెన్, మసెరాటి వంటి సంస్థలు కూడా ఇందులోకి అడుగు పెట్టాయి. ప్రఖ్యాత బ్రిటిష్ కంపెనీ ‘జాగ్వార్’ కూడా పోటీల బరిలో ఉంది. ► సాధారణ రేసింగ్ ప్రేమికుల కోణంలో ఫార్ములా–ఇ పోటీలకు ఎఫ్1 రేస్‌లతో పోలిక వస్తుంది. అయితే వీటి మధ్య ప్రస్తుతానికి పోలిక అనవసరం. అత్యుత్తమ స్థాయి సాంకేతికత వాడినా సరే, ఎఫ్1కంటే ఇ–కార్లలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. ఉదాహరణకు ఎఫ్1 కార్ హార్స్పవర్ (ఇంజన్ సామర్థ్యం) 1000 ఉంటే, ‘ఇ’ కార్లలో ఇది 350 మాత్రమే. ‘ఇ’ రేస్‌లలో ఎక్కువగా ఉండే మలుపుల వల్ల కూడా వేగం తగ్గుతుంది. అయినా సరే, అభిమానులను అలరించడంతో ఒక రకంగా అంచనాకు మించి ఫార్ములా ‘ఇ’ పోటీలు విజయవంతం అయ్యాయి. 45 నిమిషాల నిర్విరామ వినోదం అందించడంలో ఇవి అందరికీ చేరువయ్యాయి. హైదరాబాద్ రేస్ విశేషాలు వచ్చే శుక్ర, శనివారాల్లో రేస్‌లు జరుగుతాయి. శుక్రవారం, శనివారం జరిగే రెండు ఫ్రీ ప్రాక్టీస్ సెషన్లలో అన్ని జట్లు సాధన చేస్తాయి. శనివారం ఉదయం 10.40 నుంచి క్వాలిఫయింగ్ రేస్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన రేసు జరుగుతుంది. సర్క్యూట్లో మొత్తం 17 మలుపులు ఉన్నాయి. మొత్తం 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు బరిలోకి దిగుతున్నారు. భారత్‌కు చెందిన ‘మహీంద్ర’ టీమ్ 2014 నుంచి కూడా పోటీ పడుతుంది. ఈసారి మహీంద్ర జట్టుకు ఒలివర్ రోలండ్, ల్యూకాస్ గ్రాసి డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు.