దాదాపు పుష్కరకాలం క్రితం భారత్‌లో ప్రతిష్టాత్మక ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ వచ్చింది. మూడేళ్లు ఢిల్లీ బుధ్ సర్క్యూట్‌లో కార్లు దూసుకుపోయిన తర్వాత వేర్వేరు కారణాలతో ఎఫ్1 నిర్వాహకులు భారత్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సరిగ్గా పదేళ్ల క్రితం అదే అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) మన దేశంలో మరో రేసింగ్ ఈవెంట్‌కు అనుమతి ఇచ్చింది. అయితే దేశంలోనే ఇతర ప్రధాన నగరాలను కాదని ఫార్ములా–ఇ రేసింగ్‌కు వేదికగా మన హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం. భారత్‌లో జరగబోతున్న ఈ తొలి రేస్ గత కొంత కాలంగా అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. హుస్సేన్ సాగర్ తీరాన ఈ వారాంతంలో అలా జూమ్మంటూ రేసింగ్ కార్లు సందడి చేయనున్న నేపథ్యంలో ఇ–ఫార్ములా విశేషాలు...
సాక్షి, హైదరాబాద్: రేసింగ్ ప్రపంచంలో ఫార్ములావన్ అన్నింటికంటే పెద్ద ఈవెంట్. ఎఫ్1 కార్లు పెట్రోల్‌తో పని చేస్తాయి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇదే తరహాలో ఎలక్ట్రిక్ కార్లతో కూడా రేస్‌లు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) అధికారి కంగా ముందుకొచ్చింది. కాలుష్య నివారణకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇలాంటి కార్లను ప్రోత్సహించాలనే ఉద్దేశం కూడా వీటి ప్రారంభానికి కారణం. దాంతో 2014లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జరగబోతున్న ఫార్ములా–ఇ సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్‌లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయి ఈవెంట్. పర్యావరణహితం అంటూ ‘గో గ్రీన్’ పేరుతో ఈ రేసింగ్‌లను ఆయా దేశాలు ప్రోత్సహిస్తున్నాయి.
► ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు ఫార్ములా–ఇ పోటీలను నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్నది 9వ సీజన్. ఈ సీజన్‌లో మొత్తం 16 రేస్‌లు జరగనుండగా... హైదరాబాద్‌లో నాలుగోది నిర్వహిస్తున్నారు. తొలి మూడింటికి మెక్సికో సిటీ, దిరియా (సౌదీ అరేబియా–2 రేస్‌లు) ఆతిథ్యమిచ్చాయి. కేప్‌టౌన్, సావోపాలో, బెర్లిన్, మొనాకో, జకార్తా, పోర్ట్‌లాండ్, రోమ్, లండన్‌లలో తర్వాత రేస్‌లు జరుగుతాయి.
► ఎఫ్1లో ఉండే ప్రత్యేక సర్క్యూట్‌లతో పోలిస్తే ఫార్ములా–ఇ పోటీలు అన్నింటికీ దాదాపుగా జనావాసం మధ్యలో ఉండే ‘స్ట్రీట్ సర్క్యూట్‘లలో నే జరుగుతాయి. హైదరాబాద్‌లో కూడా నగరం మధ్యలో హుస్సేన్‌సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించేందుకు ఇదే ప్రధాన కారణం. ‘గ్రీన్‌కో’ సంస్థ ఈ ఈవెంట్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది.
► ఫార్ములా–ఇ కార్‌ల గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. గత ఎనిమిది సీజన్లతో పోలిస్తే ఈసారి కొత్తగా జెన్3 (జనరేషన్ 3) కార్లను ఉపయోగిస్తున్నారు. జెన్ 3 బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో ఉంటాయి. పనితీరు, సామర్థ్యంలో ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్లలో ఇవే అత్యుత్తమం. ఇందులో 40 శాతం వరకు ఎనర్జీ కేవలం బ్రేక్‌లు వాడటం ద్వారానే ‘రీజనరేటివ్’తో ఉత్పత్తి అవుతుంది. రబ్బర్, రీసైకిల్డ్ ఫైబర్‌లనే టైర్ల తయారీలో వాడతారు. కాలుష్యరహితంగా, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొనే ఈ కార్లను తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చెవులు చిల్లులు పడే ఎఫ్1 కార్ల శబ్దంతో పోలిస్తే తక్కువ డెసిబుల్స్‌తో ఈ కార్లు పరుగు తీస్తాయి.
► ఫార్ములా–ఇ జట్లలో ఎక్కువ భాగం టీమ్‌లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు చెందినవే ఉన్నాయి. భారత్‌కు చెందిన మహీంద్ర మోటార్స్ కూడా అలాంటిదే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇ–రేసింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఎఫ్1 దిగ్గజాలైన మెక్‌లారెన్, మసెరాటి వంటి సంస్థలు కూడా ఇందులోకి అడుగు పెట్టాయి. ప్రఖ్యాత బ్రిటిష్ కంపెనీ ‘జాగ్వార్’ కూడా పోటీల బరిలో ఉంది.
► సాధారణ రేసింగ్ ప్రేమికుల కోణంలో ఫార్ములా–ఇ పోటీలకు ఎఫ్1 రేస్‌లతో పోలిక వస్తుంది. అయితే వీటి మధ్య ప్రస్తుతానికి పోలిక అనవసరం. అత్యుత్తమ స్థాయి సాంకేతికత వాడినా సరే, ఎఫ్1కంటే ఇ–కార్లలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. ఉదాహరణకు ఎఫ్1 కార్ హార్స్‌పవర్ (ఇంజన్ సామర్థ్యం) 1000 ఉంటే, ‘ఇ’ కార్లలో ఇది 350 మాత్రమే. ‘ఇ’ రేస్‌లలో ఎక్కువగా ఉండే మలుపుల వల్ల కూడా వేగం తగ్గుతుంది. అయినా సరే, అభిమానులను అలరించడంతో ఒక రకంగా అంచనాకు మించి ఫార్ములా ‘ఇ’ పోటీలు విజయవంతం అయ్యాయి. 45 నిమిషాల నిర్విరామ వినోదం అందించడంలో ఇవి అందరికీ చేరువయ్యాయి.
హైదరాబాద్ రేస్ విశేషాలు
వచ్చే శుక్ర, శనివారాల్లో రేస్‌లు జరుగుతాయి. శుక్రవారం, శనివారం జరిగే రెండు ఫ్రీ ప్రాక్టీస్ సెషన్‌లలో అన్ని జట్లు సాధన చేస్తాయి. శనివారం ఉదయం 10.40 నుంచి క్వాలిఫయింగ్ రేస్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన రేసు జరుగుతుంది. సర్క్యూట్‌లో మొత్తం 17 మలుపులు ఉన్నాయి. మొత్తం 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు బరిలోకి దిగుతున్నారు. భారత్‌కు చెందిన ‘మహీంద్ర’ టీమ్ 2014 నుంచి కూడా పోటీ పడుతుంది. ఈసారి మహీంద్ర జట్టుకు ఒలివర్ రోలండ్, ల్యూకాస్ గ్రాసి డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment