సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా–ఈ మధ్య జరిగిన ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహన రంగానికి చిరునామాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. హైదరాబాద్‌లో ‘ఫార్ములా–ఈ రేసింగ్’ నిర్వహించనున్నామని.. చారిత్రక, ఆధునిక సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేస్ నిర్వహణ ద్వారా ‘ఈ– మొబిలిటీ’ రంగంలో రాష్ట్రానికి అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
హైదరాబాద్‌లో రేసింగ్ నిర్వహణపై ఆసక్తి వ్యక్తీకరిస్తూ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం, ‘ఫార్ములా–ఈ’ మ ధ్య సోమవారం ఒప్పందం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) కుదిరింది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో పేరొందిన ఆటోమొబైల్ తయారీ సంస్థలతో మొబిలిటీ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని.. చార్జింగ్ రంగంలో రెడ్‌కోతో కలిసి పనిచేసేందుకు మౌలిక వసతుల కంపెనీలను ఆహ్వానిస్తామని, అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.
ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో దివిటిపల్లి, సీతారాంపూర్‌లో రెండు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని.. త్వరలో నాలుగు ఈ–బస్ తయారీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని వెల్లడించారు. అంతేగాకుండా మూడు సెల్‌ఫోన్ తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామని.. మొత్తంగా భవిష్యత్ టెక్నాలజీ, సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలతో హైదరాబాద్‌ను ‘ఈవీ హబ్’గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
‘ఈవీ’ సదస్సుతో ఆకర్షించేలా..
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను గుర్తిస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ విప్లవానికి హైదరాబాద్‌ను కేంద్రంగా నిలుపుతామని.. దేశాన్ని ముందుండి నడిపిస్తామని కేటీఆర్ అన్నారు. ‘ఫార్ములా–ఈ’ నిర్వహిస్తే.. ప్రపంచంలో పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, ర్లిన్, మొనాకో వంటి 18 నగరాల సరసన హైదరాబాద్ చేరుతుందని చెప్పారు. వచ్చే ఏడాది మొదట్లో జరిగే ఫార్ములా–ఈ రేస్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈవీ సంస్థలను ఆహ్వానించి ‘ఈవీ సదస్సు’ నిర్వహిస్తామని.. ఈవీ రంగంలో భారత్‌కు, ప్రత్యేకించి తెలంగాణకు ఉన్న ప్రత్యేకతలను వివరిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
ఫార్ములా–ఈ రేస్ నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు పోటీ పడుతున్నా.. హైదరాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటైజ్, డీ కార్బనైజ్, డీ సెంట్రలైజ్ మంత్రాన్ని పఠిస్తోందని.. కర్బన రహిత ఉద్గారాల దిశగా పారిశ్రామిక రంగం కూడా తన దిశను మార్చుకుంటోందని వివరించారు. సీఎం కేసీఆర్ కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ హరితహారాన్ని చేపట్టారని.. ఆ కార్యక్రమం ద్వారా ఏడున్నరేండ్లలో రాష్ట్రంలో 147 రెట్ల పచ్చదనం పెరిగిందని తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనలో తెలంగాణలో రెండో స్థానానికి చేరిందన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఫార్ములా–ఈ సహ వ్యవస్థాపకులు, చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బెర్టో లాంగో, డైరెక్టర్ ఆగస్ జొమానో, మహీంద్రా రేసింగ్ సీఈవో దిల్బాగ్ సింగ్, గ్రీన్‌కో సీఈవో అనిల్ చలమలశెట్టి, ఈవీ డైరెక్టర్ సుజయ్ కారంపూరి, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ రేస్ కార్లతో..
కన్నుమూసి తెరిచేలోగా అత్యంత వేగంగా మలుపులు తిరుగుతూ దూసుకెళ్లే ‘ఫార్ములా–వన్’ రేసింగ్ అందరికీ తెలిసిందే. అయితే శిలాజ ఇంధనాలు వాడకుండా.. ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ప్రపంచస్థాయి రేసింగ్ పోటీలే.. ‘ఫార్ములా–ఈ’. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా ఆదరణ పొందుతున్న కార్ రేసింగ్ చాంపియన్‌షిప్ ఇదే. దీనికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికిపైగా వీక్షకులు ఉన్నట్టు అంచనా.
అలాంటి ప్రఖ్యాత రేసింగ్ హైదరాబాద్‌లో జరిగితే.. వివిధ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ప్రకారం.. మౌలిక వసతుల కల్పన, ఏర్పాట్లు, అవసరాలను పరిశీలిస్తారు. మూడు నెలల్లో తుది ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య హైదరాబాద్‌లో ‘ఫార్ములా–ఈ’ రేసింగ్ జరుగనుంది.
కేటీఆర్ నా కల నెరవేరుస్తున్నారు
ప్రతిష్టాత్మక ‘ఫార్ములా–ఈ’ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనుండటంపై ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సొంత గడ్డపై మహీంద్రా రేసింగ్ కార్లు పరుగులు పెట్టబోతున్నాయి. చిరకాల కల నెరవేరబోతోంది. ఈ కలను నెరవేర్చేదిశగా అడుగు వేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment