సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్‌లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్‌లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్‌టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు.
గతేడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో అయిన స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు ఏ జిల్లాలో అయినా స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకావొచ్చు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సులభతరం
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్‌ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. అప్పట్లో సర్టిఫికెట్‌లు పొందడానికి దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది.
ఆస్పత్రుల సంఖ్యను 173కి పెంచింది. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రజలకు ఇప్పుడు సులభంగా సదరం సేవలు లభిస్తున్నాయి. నాడు ఏడాదికి 25వేల నుంచి 30 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, ప్రస్తుతం ఏడాదికి అంతకన్నా మూడు రెట్లు అధికంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. 2022–23 సంవత్సరంలో 2.99 లక్షల స్లాట్‌లను ప్రభుత్వం విడుదల చేయగా, 2.25 లక్షల స్లాట్‌లు బుక్ అయ్యాయి. సందరం క్యాంప్‌లకు హాజరైన వారికి స్క్రీనింగ్ నిర్వహించి 96,439 సర్టిఫికెట్‌లను మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment