sadaram certificates
-
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు. గతేడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో అయిన స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు ఏ జిల్లాలో అయినా స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకావొచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సులభతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. అప్పట్లో సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను 173కి పెంచింది. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రజలకు ఇప్పుడు సులభంగా సదరం సేవలు లభిస్తున్నాయి. నాడు ఏడాదికి 25వేల నుంచి 30 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, ప్రస్తుతం ఏడాదికి అంతకన్నా మూడు రెట్లు అధికంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. 2022–23 సంవత్సరంలో 2.99 లక్షల స్లాట్లను ప్రభుత్వం విడుదల చేయగా, 2.25 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయి. సందరం క్యాంప్‌లకు హాజరైన వారికి స్క్రీనింగ్ నిర్వహించి 96,439 సర్టిఫికెట్లను మంజూరు చేశారు. -
సదరం స్కాంలో సర్కారు ఉద్యోగులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి కేంద్రంగా వెలుగుచూసిన సదరం స్కాంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఆర్డీఏ అధికారులు, సివిల్ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించిన అధికారులకు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇంతకాలం సదరం సర్టిఫికెట్లను పింఛన్లు, ఆదాయ పన్ను మినహాయింపు, బస్‌పాస్, రైల్వేపాస్‌ల్లో రాయితీ కోసం తీసుకుంటున్నారని అంతా భావించారు. కానీ.. విచిత్రంగా దర్యాప్తులో సరికొత్త నిజం వెలుగుచూసింది. ఈ సర్టిఫికెట్లను తీసుకున్న వారిలో సామాన్య ప్రజలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు గుర్తించడం కేసును మరో మలుపు తిప్పింది. త్వరలోనే వీరి విచారణ..! వాస్తవానికి సదరం స్కాం వెలుగుచూసిన సమయంలో 317 జీవో అమలులో ఉంది. ఆ సమయంలో చాలామంది ప్రభు త్వ ఉద్యోగులు తాము దివ్యాంగులమని అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు పొందారు. ప్రస్తుతం ఏసీబీ సేకరించిన 22 మంది ప్రభుత్వ ఉద్యోగుల జాబితాను ఏసీబీ అధికారులు ఇప్పటికే తనిఖీ చేశారని సమాచారం. వీరు ఇటీవల జరిగిన బదిలీల్లోనూ ఈ సర్టిఫికెట్లను చూపినట్లు తెలిసింది. ఈ క్రమంలో బదిలీల లిస్టులో వీరు ఈ సర్టిఫికెట్లను కోరుకున్న స్థానాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారా? లేదా అని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వీరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ఏ స్థానంలో పనిచేస్తున్నారు? అన్న విషయాలపై దృష్టి సారించారు. ఈ విషయంలో వీరు ఒక నిర్ధారణకు వస్తే.. అప్పుడు వీరిని పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. దాంతోపాటు.. సర్టిఫికెట్లు కలిగి ఉన్న సివిల్ ఆసుపత్రి సిబ్బంది వెంటనే సమర్పించాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఏసీబీ ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందని సమాచారం. 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు 2020 కరోనాకు ముందు సదరం సర్టిఫికెట్ల జారీ మొత్తం మ్యాన్యువల్ విధానంలో జరిగేది. ► కరోనాతో 2020లో శిబిరాలు నిర్వహించలేదు. ► 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన స్లాట్లపై తీవ్ర దుమారం రేగింది. జారీ చేసిన సర్టిఫికెట్లలో అధికశాతం అనర్హులకు కేటాయించారన్న విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ► వాస్తవానికి ఈ కుంభకోణం మూలాలు 2015 నుంచే ఉన్నప్పటికీ.. ఆన్లైన్లో డీఆర్డీఏ– సివిల్ ఆసుపత్రి వారు కుమ్మక్కై తమకు కావాల్సిన వారికే స్లాట్లు దక్కేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ► ఈ ఏడాది వ్యవధిలో పొందిన సర్టిఫికెట్లలో మొత్తం 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని గుర్తించింది. వీరిలో దాదాపు 14 మంది కరీంనగర్‌కు నగరానికి చెందినవారే కావడం గమనార్హం. ► మిగిలిన వారు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో నివసిస్తున్నారు. వీరంతా పోయినేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ వరకు వివిధ క్యాంపుల్లో సర్టిఫికెట్లు తీసుకున్నారు. వీరి సర్టిఫికెట్లు అనుమానాస్పదంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు వీరి వ్యక్తిగత వివరాలు, ఫోన్నెంబర్లను సేకరించారు. -
చీటర్ పట్టివేత
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సదరం సర్టి ఫికెట్ ఇప్పిస్తానంటూ ఓ వికలాంగురాలి నుంచి డబ్బు వసూలు చేసి, ముఖం చాటేసిన చీటర్‌ను సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 8న ధర్మవరం తారకరామాపురానికి చెందిన రామలక్ష్మి సదరం సర్టిఫికెట్ కోసం ఓపీ నంబర్ 9కి వెళ్లింది. ఓపీ వద్ద ఓ వ్యక్తి వైకల్యం సర్టిఫికెట్ ఇప్పిస్తానని, అందుకు రూ.వెయ్యి ఖర్చు అవుతుందని తెలిపాడు. దీంతో రామలక్ష్మి తన వద్ద అంత లేదని రూ.600 మాత్రమే ఉందని చెప్పింది. ఉన్న డబ్బులు ఇవ్వాలని, సర్టిఫికెట్ ఇచ్చే ముందు మిగతా రూ.400 ఇవ్వాలని చెప్పాడు. సర్టిఫికెట్ వస్తుందన్న ఆశతో ఆమె రూ.600 సమర్పించుకుంది. మొదట ఆధార్‌కార్డు జిరాక్స్ చేసుకుని రావాలని, తాను ఇక్కడే ఉంటానని తెలిపాడు. జిరాక్స్ చేయించుకుని ఓపీ వద్దకు వస్తే ఆ వ్యక్తి కనిపించకపోవడంతో తాను మోసపోయానని రామలక్ష్మి సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్ దృష్టికి తీసుకెళ్లింది. చాకచక్యంగా.. ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలో నమోదైన ఫొటోను సెల్లో తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఓపీ నంబర్ 9 వద్ద మరోసారి సదరు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. సెక్యూరిటీ సూపర్వైజర్లు ఇర్ఫాన్, నరేష్ గట్టిగా నిలదీయడంతో రామలక్ష్మి నుంచి సర్టిఫికెట్ కోసం డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. తన పేరు రెడ్డప్పరెడ్డి అని, ఊరు నల్లమాడ మండలం అయ్యన్నగారిపల్లి అని తెలిపాడు. అనంతరం అతడిని సెక్యూరిటీ సిబ్బంది టూటౌన్ పోలీసులకు అప్పగించారు. -
ఎప్పటికప్పుడు ‘సదరం’ సర్టిఫికెట్లు జారీ !
అనంతపురం మెడికల్ : వైకల్య ధ్రువీకరణ తర్వాత పంపిణీ చేయాల్సిన ‘సదరం’ సర్టిఫికెట్లు జారీపై ‘సాక్షి’లో వరుస కథనాలు వస్తుండటంతో జిల్లా యంత్రాంగం కదిలింది. ఇందులో భాగంగానే శుక్రవారం సర్వజనాస్పత్రికి వచ్చిన డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ చాంబర్లో సమావేశమయ్యారు. సైకియాట్రి హెచ్ఓడీ డాక్టర్ ప్రభాకర్, ఈఎన్టీ హెచ్ఓడీ సంపత్ కుమార్, నేత్ర విభాగం హెచ్ఓడీ శ్రీనివాసులుతో చర్చించారు. సర్టిఫికెట్ల జారీలో దళారులు, సిబ్బంది హస్తం ఉన్నట్లు తెలుస్తోందని, వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఏరోజుకారోజు సర్టిఫికెట్లు జారీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. సర్వజనాస్పత్రిలో ప్రతి గురువారం ఆర్థో, బుద్ధిమాంద్యత, శనివారం అంధత్వ, చెవిటికి సంబంధించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. త్వరలో ఈ రెండు రోజుల్లో పరీక్ష చేశాక సాయంత్రానికే సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి ఆపరేటర్లను నియమిస్తామని పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి రోజూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, బాధితుల బంధువులు ఆధార్, రేషన్‌కార్డు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. గతంలో పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు రాని వారికి శనివారం రోజుల్లో పరిశీలన చేసి వాటిని అందిస్తామన్నారు. తప్పనిసరిగా ఆధార్, రేషన్‌కార్డు తీసుకురావాలన్నారు. వినికిడికి సంబంధించి ‘బెరా’ యంత్రం వచ్చిన తర్వాతే పరీక్షలు ప్రారంభిస్తామని స్పష్టం తెలిపారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కాగా మానసిక వికలాంగులకు సంబంధించి ఆదివారం, సెలవుదినాల్లో మినహా ప్రతి రోజు తాను పరీక్షలు చేస్తానని మానసిక వైద్యుడు ప్రభాకర్ తెలిపారు. -
నేటినుంచి ‘సదరం’
ప్రగతినగర్ : వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించే విషయంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నుంచి వారం పాటు నియోజకవర్గాల వారీగా శిబిరాలు నిర్వహించనున్నారు.వికలాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ విషయంలో జాప్యం జరుగుతుండడంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ కాకపోవడం, జారీ అయిన వాటిలోనూ వైద్యుల సంతకాలు లేకపోవడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని గమనించిన కలెక్టర్.. నియోజకవర్గాల వారీగా సదరం ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారంనుంచి 16వ తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఆస్పత్రులలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే గతంలో మాదిరిగా నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈసారి సదరం క్యాంపులకు సూపర్వైజర్లను, క్యాంపు ఇన్చార్జి వైద్యుడిని, కోఆర్డినేటర్లును నియమించారు. క్యాంప్‌ల సూపర్వైజర్లు, ఇన్చార్జి వైద్యులు, కోఆర్డినేటర్లుగా నియమితులైనవారు తప్పనిసరిగా ఆయా క్యాంపులను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాంపులు, అధికారులు వీరే.. నిజామాబాద్ మండలంలోని వికలాంగులకోసం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపు సూపర్వైజర్గా జడ్పీ సీఈఓ రాాజారాం, క్యాంప్ ఇన్చార్జి వైద్యుడిగా రజనీకాంత్, కోఆర్డినేటర్‌గా ఐకేపీ ఏపీఎం మోహన్ వ్యవహరిస్తారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ మండలం మినహా మిగిలిన మండలాల వికలాంగుల కోసం డిచ్పల్లి సీహెచ్‌సీలో శిబిరం ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్వైజర్గా డీపీఓ కృష్ణమూర్తి, ఇన్చార్జి వైద్యుడిగా రాథోడ్, కోఆర్డినేటర్ రవీందర్ సేవలందిస్తారు. బోదన్ నియోజకవర్గంలో బోధన్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో మెప్మా పీడీ సత్యనారాయణ సూపర్వైజర్గా, ఇన్చార్జి వైద్యుడిగా భానుప్రసాద్, కోఆర్డినేటర్‌గా సాయిలు ఉంటారు. బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్వైజర్గా డీసీహెచ్ఎస్ శివదాస్, ఇన్చార్జి డాక్టర్‌గా శ్రీనివాస్, కోఆర్డినేటర్‌గా రవీందర్ సేవలందిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్‌లో ఏర్పాటుచేసిన క్యాంప్ సూపర్వైజర్గా డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే, ఇన్చార్జి వైద్యుడిగా నారాయణ, కోఆర్డినేటర్ నీలిమ వ్యవహరిస్తారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్వైజర్గా డీఆర్డీఏ పీడీ వెంకటేశం, ఇన్చార్జి వైద్యుడిగా అజయ్‌కుమార్, కోఆర్డినేటర్‌గా సుధాకర్ ఉంటారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన క్యాంప్ కోఆర్డినేటర్‌గా మండల ప్రత్యేకాధికారి గంగాధర్, ఇన్చార్జి వైద్యుడిగా బాలోజీ, కోఆర్డినేటర్‌గా రచ్చయ్య వ్యవహరిస్తారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ సీహెచ్‌సీ క్యాంప్ సూపర్వైజర్గా డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే, ఇన్చార్జి డాక్టర్‌గా మోహన్‌బాబు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉంటారు. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ పీహెచ్సీలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్వైజ ర్గా డీసీహెచ్ఎస్ శివదాస్, ఇన్చార్జి డాక్టర్‌గా బాల మురళి, కోఆర్డినేటర్‌గా రవీందర్ వ్యవహరిస్తారు.