అనంతపురం మెడికల్ : వైకల్య ధ్రువీకరణ తర్వాత పంపిణీ చేయాల్సిన ‘సదరం’ సర్టిఫికెట్లు జారీపై ‘సాక్షి’లో వరుస కథనాలు వస్తుండటంతో జిల్లా యంత్రాంగం కదిలింది. ఇందులో భాగంగానే శుక్రవారం సర్వజనాస్పత్రికి వచ్చిన డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ చాంబర్‌లో సమావేశమయ్యారు. సైకియాట్రి హెచ్‌ఓడీ డాక్టర్ ప్రభాకర్, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ సంపత్ కుమార్, నేత్ర విభాగం హెచ్‌ఓడీ శ్రీనివాసులుతో చర్చించారు. సర్టిఫికెట్ల జారీలో దళారులు, సిబ్బంది హస్తం ఉన్నట్లు తెలుస్తోందని, వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఏరోజుకారోజు సర్టిఫికెట్లు జారీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు.
సర్వజనాస్పత్రిలో ప్రతి గురువారం ఆర్థో, బుద్ధిమాంద్యత, శనివారం అంధత్వ, చెవిటికి సంబంధించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. త్వరలో ఈ రెండు రోజుల్లో పరీక్ష చేశాక సాయంత్రానికే సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి ఆపరేటర్లను నియమిస్తామని పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి రోజూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, బాధితుల బంధువులు ఆధార్, రేషన్‌కార్డు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు.
గతంలో పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు రాని వారికి శనివారం రోజుల్లో పరిశీలన చేసి వాటిని అందిస్తామన్నారు. తప్పనిసరిగా ఆధార్, రేషన్‌కార్డు తీసుకురావాలన్నారు. వినికిడికి సంబంధించి ‘బెరా’ యంత్రం వచ్చిన తర్వాతే పరీక్షలు ప్రారంభిస్తామని స్పష్టం తెలిపారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కాగా మానసిక వికలాంగులకు సంబంధించి ఆదివారం, సెలవుదినాల్లో మినహా ప్రతి రోజు తాను పరీక్షలు చేస్తానని మానసిక వైద్యుడు ప్రభాకర్ తెలిపారు.
ఎప్పటికప్పుడు ‘సదరం’ సర్టిఫికెట్లు జారీ !
Published Fri, Jan 27 2017 11:45 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement