![Cheater Caught In Sarvajana Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/14/cheatr.jpg.webp?itok=t94fRoFd)
రెడ్డప్పరెడ్డిని పట్టుకున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్లు
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సదరం సర్టి ఫికెట్ ఇప్పిస్తానంటూ ఓ వికలాంగురాలి నుంచి డబ్బు వసూలు చేసి, ముఖం చాటేసిన చీటర్‌ను సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 8న ధర్మవరం తారకరామాపురానికి చెందిన రామలక్ష్మి సదరం సర్టిఫికెట్ కోసం ఓపీ నంబర్ 9కి వెళ్లింది. ఓపీ వద్ద ఓ వ్యక్తి వైకల్యం సర్టిఫికెట్ ఇప్పిస్తానని, అందుకు రూ.వెయ్యి ఖర్చు అవుతుందని తెలిపాడు. దీంతో రామలక్ష్మి తన వద్ద అంత లేదని రూ.600 మాత్రమే ఉందని చెప్పింది. ఉన్న డబ్బులు ఇవ్వాలని, సర్టిఫికెట్ ఇచ్చే ముందు మిగతా రూ.400 ఇవ్వాలని చెప్పాడు. సర్టిఫికెట్ వస్తుందన్న ఆశతో ఆమె రూ.600 సమర్పించుకుంది. మొదట ఆధార్‌కార్డు జిరాక్స్ చేసుకుని రావాలని, తాను ఇక్కడే ఉంటానని తెలిపాడు. జిరాక్స్ చేయించుకుని ఓపీ వద్దకు వస్తే ఆ వ్యక్తి కనిపించకపోవడంతో తాను మోసపోయానని రామలక్ష్మి సెక్యూరిటీ సూపర్‌వైజర్ ఇర్ఫాన్ దృష్టికి తీసుకెళ్లింది.
చాకచక్యంగా..
ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్‌వైజర్ ఇర్ఫాన్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలో నమోదైన ఫొటోను సెల్‌లో తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఓపీ నంబర్ 9 వద్ద మరోసారి సదరు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. సెక్యూరిటీ సూపర్‌వైజర్లు ఇర్ఫాన్, నరేష్ గట్టిగా నిలదీయడంతో రామలక్ష్మి నుంచి సర్టిఫికెట్ కోసం డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. తన పేరు రెడ్డప్పరెడ్డి అని, ఊరు నల్లమాడ మండలం అయ్యన్నగారిపల్లి అని తెలిపాడు. అనంతరం అతడిని సెక్యూరిటీ సిబ్బంది టూటౌన్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment