
డైట్‌సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
బుక్కపట్నం : డైట్‌సెట్ -2014 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం బుక్కపట్నంలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో ప్రారంభమైంది. మొదటిరోజు హాజరైన విద్యార్థులతో కళాశాల కిక్కిరిసి పోయింది. సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24 దాకా కొనసాగుతుందని ప్రిన్సిపాల్ మునెయ్య తెలిపారు. చెక్‌లిస్టులో పేర్కొన్న విధంగా అన్ని సర్టిఫికెట్లను సక్రమంగా పరిశీలనాధికారులకు సమర్పించాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. అలాట్‌మెంట్ కాపీతో పాటు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలన్నారు.
ర్యాంకుల వారీగా ఆయా కళాశాలలకు కేటాయిస్తామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయి. అనేక మంది ఇంటర్‌లో సెకండ్ లాంగ్వేజ్‌గా సంస్కృతం తీసుకున్నారు. తెలుగు ఉంటేనే సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని డైట్ సిబ్బంది చెప్పారు. నోటిఫికేషన్‌లో ఎలాంటి నిబంధనలు పేర్కొనలేదని, ఇప్పుడు మాత్రం ఇలా అంటున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. దీనిపై డైట్ ప్రిన్సిపాల్ మునెయ్య స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకుడు రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.