రోహిత్ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోంది
♦ అతని కుల ధ్రువీకరణపై కొన్ని సందేహాలున్నాయి
♦ స్పష్టత కోసం గుంటూరు కలెక్టర్‌కు లేఖలు రాశాం
♦ సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం..
♦ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం
♦ హైకోర్టుకు సైబరాబాద్ పోలీసుల నివేదన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ పోలీసులు ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. రోహిత్ కుల ధ్రువీకరణపై కొన్ని సందేహాలున్నాయని, వీటి నివృత్తి కోసం గుంటూరు జిల్లా కలెక్టర్‌కు లేఖలు రాశామని, అది తేలిన తర్వాత దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు. అలాగే రోహిత్ ఆత్మహత్య లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్ తదితరులపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులకు పీహెచ్‌డీ విద్యార్థి ప్రశాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు వీసీ అప్పారావు తదితరులపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో తమపై కేసును కొట్టేయాలంటూ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు, రామచంద్రరావు అరెస్ట్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని మాదాపూర్ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ జె.రమేశ్‌కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. రోహిత్ ఆత్మహత్య తర్వాత అతని సర్టిఫికెట్లు పరిశీలిస్తే అందులో ఎస్‌సీ అని ఉందని, అయితే గురజాల తహసీల్దార్ మాత్రం రోహిత్ వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా నివేదిక ఇచ్చారని తెలిపారు. రోహిత్ కులంపై స్పష్టత లేకపోవడంతో స్పష్టత కోసం గుంటూరు కలెక్టర్‌కు రెండుసార్లు లేఖలు రాశామని, కలెక్టర్ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఈ పరిస్థితుల్లో పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.