'దళితుడే కాదని కులరాజకీయం చేస్తున్నారు'
హైదరాబాద్: పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్సీయూలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది సేపటికే ర్యాలిగా వచ్చిన విద్యార్థులు ఆమె దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
దళిత ఉద్యమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నాయని హెచ్సీయూ జేఏసీ విద్యార్థులు మండిపడ్డారు. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్మృతి ఇరానీ రాజీనామా చేసేంతవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.
'స్మృతి ఇరానీ ఏబీవీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు కమిటీ రిపోర్ట్ను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. రోహిత్ దళితుడు కాదని కుల రాజకీయం చేస్తున్నారు. రోహిత్ దళితుడు కాకుంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ విభాగం ఎస్సీ సర్టిఫికెట్ ఎలా మంజూరు చేసింది. కులాన్ని బట్టి మనిషికి విలువ కడతారా?. కేంద్రం వేసిన నిజ నిర్థారణ కమిటీ నివేదిక ఇవ్వకముందే ఆ అంశంపై స్మృతి ఇరానీ ఎలా మాట్లాడతారు.
లేఖతో దత్తాత్రేయకు సంబంధం లేదని కిషన్ రెడ్డి అంటున్నారు. మరి దత్తాత్రేయ లేఖ పంపించారని స్మృతి ఇరానీ అంటున్నారు. బీజేపీ నేతల్లోనే క్లారిటీ లేదు.మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తాం. కులాన్ని బట్టి మనిషి విలువను లెక్కగడతారా?.' అని హెచ్సీయూ విద్యార్థుల జేఏసీ పేర్కొంది.