
ప్రమాదం జీవితాన్ని మార్చేసింది!
ఓ ప్రమాదం అతడి జీవితాన్ని మార్చేసింది... తన స్నేహితులను కోల్పోవడమే కాక.. బుద్ధిమాంద్యాన్ని మిగిల్చింది. చివరికి అతడి బంధువు తోడ్పాటుకు... అతడి మానసిక శక్తి తోడవ్వడంతో ఎలాగైతే రుగ్మతను జయించగలిగాడు.
ఓ ప్రమాదం అతడి జీవితాన్ని మార్చేసింది... తన స్నేహితులను కోల్పోవడమే కాక.. బుద్ధిమాంద్యాన్ని మిగిల్చింది. చివరికి అతడి బంధువు తోడ్పాటుకు... అతడి మానసిక శక్తి తోడవ్వడంతో ఎలాగైతే రుగ్మతను జయించగలిగాడు. డ్యాన్సింగ్ స్టార్ గా మారడమే కాదు... సైక్లిస్ట్ గా, స్విమ్మర్ గా ఏకంగా లిమ్కా బుక్ రికార్డు సాధించి ఎందరికో స్ఫూర్తిని నింపాడు.
ఇండియాలోని పూనె కు చెందిన రోహిత్ నాలుగేళ్ళ వయసులో ప్రమాదానికి గురై.. తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి తక్షణం వైద్యం అందించిన డాక్టర్లు... గాయాలకు కుట్లు వేసి ప్రమాదం ఏమీ లేదని సాధారణ స్థితికి చేరుకుంటాడని చెప్పారు. రోహిత్ కుటుంబ సభ్యులు కూడ ఎంతో సంతోష పడ్డారు. డాక్టర్లు చెప్పినట్లుగానే రోహిత్ తిరిగి సాధారణ స్థితికి చేరుకొన్నాడు. కానీ కొన్నేళ్ళ తర్వాత రోడ్డుపై నడుస్తూ ఉన్నట్లుండి కుప్ప కూలిపోయాడు. ఈసారి రోహిత్ పరిస్థితి విషమంగా మారడంతో ముంబై ఆస్పత్రికి తరలించారు. అయితే రోహిత్ ను పరిశీలించిన వైద్యులు.. అతడికి దెబ్బలు తగిలిన సమయంలో సరైన వైద్యం అందకపోవడం వల్ల, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితికి చేరుకున్నట్లు గుర్తించారు. ఇప్పటికే తీవ్ర జాప్యం జరగడం వల్ల రోహిత్ మానసిక ఎదుగుదలపై ఆ ప్రభావం పడిందని చెప్పారు. రోహిత్ కు 18 ఏళ్ళ వయసు వచ్చినా బ్రెయిన్ మాత్రం ఎదగలేదని, ఎనిమిదేళ్ళ వయసుకు ఉండాల్సినట్టుగానే ఉందని వైద్యులు చెప్పినట్లుగా రోహిత్ తల్లి మృణాల్ సావంత్ చెప్తున్నారు.
రోహిత్ మానసిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో అతడు కొత్త సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్నేహితులు కూడ క్రమంగా దూరమయ్యారు. ఇతర పిల్లలతో మాట్లాడలేకపోయేవాడు. పాఠశాలకు వెళ్ళడం కూడ మానేసి, చివరికి బుద్ధిమాద్యానికి లోనయ్యాడు. దీంతో అతడి జీవితం వృధా కాకూడదని భావించిన రోహిత్ దగ్గరి బంధువైన రాహుల్ మురుంద్ కర్ జోక్యం చేసుకొని... అతడి శక్తిని, భావోద్వేగాలను డ్యాన్స్ ద్వారా బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చేసిన రాహుల్ ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చినా వదులుకొని, పూనె లోనే రోహిత్ కు డ్యాన్స్ నేర్పించేందుకు సిద్ధమయ్యాడు.
.
రాహుల్ ప్రయత్నం వృధా కాలేదు. రోహిత్ లో డ్యాన్స్ కొత్త ఉత్సాహాన్ని తెచ్చి పెట్టింది. మొదట్లో నేర్పించడం కాస్త కష్టమైనా రోజురోజుకూ అతడిలో వస్తున్న మార్పను గమనిస్తూ... రాహుల్ అతడికి విభన్న రీతుల్లో బాలీవుడ్, జుంబా వంటి నృత్యాలను నేర్పించడం కొనసాగించాడు. తర్వాత తానే ఇతర పిల్లలకు కోచింగ్ ఇచ్చే స్థాయికి రోహిత్ చేరాడు. శ్రీ డ్యాన్స్ అకాడమీ పేరున రాహుల్ కేవలం రోహిత్ తో పాటు అతడి స్నేహితుడి కోసం స్థాపించిన డ్యాన్స్ స్కూల్... ప్రస్తుతం 7 వందల మంది విద్యార్థులతో కొనసాగుతోంది. అంతేకాదు స్కూల్ నిర్వహించే వార్షిక కార్యక్రమంలో కూడ రోహిత్ తన డ్యాన్స్ ప్రదర్శనలతో ప్రత్యేకాకర్షణగా మారాడు. వికలాంగ పిల్లల వినోద, సాంస్కృతిక కేంద్రమైన బాలకల్యాణ్ సంస్థాన్ లో పిల్లలకు రోహిత్ డ్యాన్స్ కోచింగ్ కూడ ఇస్తున్నాడు. తన డ్యాన్స్ కు పలు అవార్డులు కూడ గెలుచుకున్నాడు.
ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన అంతర్జాతీయ జుంబా కన్వెన్షన్ 2015 లో జుంబా స్థాపకుడు అల్బెర్టో బెటో పెరెజ్ కూడ రోహిత్ ను ఎంతగానో కొనియాడారు.అంతకు ముందే ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో రోహిత్ నటనను బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి వంటి వారెందరో ప్రశంసించారని రోహిత్ తల్లి మృనాల్ గర్వంగా చెప్తున్నారు. రోహిత్ శక్తి ఒక్క నృత్యానికే పరిమితం కాలేదు. క్రీడా రంగంలోనూ రోహిత్ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోయాడు. జాతీయ స్థాయి ఈతగాడిగా, సైక్టిస్ట్ గా గుర్తింపు పొందాడు. ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకోవడమే కాక, బాల కల్యాణ్ సంస్థాన్ నుంచి మరో ఇద్దరు వైకల్యం కలిగిన విద్యార్థులతో పాటు 2014 లో 13 గంటలపాటు నాన్ స్టాప్ గా ఈతకొట్టి లిమ్కా బుక్ లో కూడ స్థానం సంపాదించాడు. ప్రస్తుతం పూనెలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం నిధులు సేకరించేందుకు రోహిత్... 'జుంబా పార్టీ.. లూజ్ ఫర్ ఎ కాజ్' పేరిట ఓ కార్యక్రమాన్ని కూడ రూపొందించాడు.