'చెప్పేది వినకుండా అంతలా కొట్టిస్తారా'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపైన మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. విద్యార్థులు చెప్పేది వినకుండా వారి అమానుషంగా కొట్టిస్తారా అని ప్రశ్నిస్తూ సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై ఆరెస్సెస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థులపై పోలీసులు, అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిలను కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఆప్ ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్ 'నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. విద్యార్థులపై అంతటి దాడి చేస్తారా. ఆరెస్సెస్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని కారణంతో విద్యార్థులు ఏం చెప్తున్నారో కూడా వినకుండా ప్రధాని మోదీ ప్రభుత్వం వారిని అమానుషంగా కొట్టించింది. అమ్మాయిలని కూడా చూడకుండా వారిని జుట్టుపట్టిలాగి ఈడ్చి కొట్టారు' అని రాహుల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు పోలీసుల్లాగా కాకుండా బీజేపీ, ఆరెస్సెస్ ప్రైవేటు సైన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.