రాహుల్ గాంధీని నిర్భంధించిన పోలీసులు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం ఆచరణలోకి రావడం లేదనే మనస్తాపంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి రామ్ క్రిషన్ గ్రెవాలే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో కోపోద్రేకుడైన రాహుల్.. ఇదే కొత్త భారత్ అని వ్యాఖ్యానించారు. ఘటనపై స్పందించిన ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా.. ఆసుపత్రి కుటుంబాన్ని పరామర్శించే ప్రదేశం కాదని అన్నారు. ఆసుపత్రిలో పరామర్శ కుదరదని చెబుతున్నా రాహుల్ వినకపోవడంతోనే అడ్డుకోవాల్సివచ్చిందని వెల్లడించారు. ఆయన్ను ప్రస్తుతం మందిర్ మార్గ్ పోలీసు ఠాణాలో ఉంచినట్లు చెప్పారు. మాజీ జవాను కుటుంబాన్ని పలకరించేందుకు వచ్చిన ఆప్ నేతలు ఆసుపత్రి వాతావరణాన్ని గందరగోళంలోకి నెట్టే పరిస్ధితిని కల్పించేందుకు యత్నించినట్లు తెలిపారు.
గ్రెవాల్ కుటుంబసభ్యులు రాజకీయ నేతలను కలిసేందుకు యత్నిస్తుండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే అడ్డంకులు సృష్టించడం కాదని అన్నారు. ఆసుపత్రి మీటింగ్ ల ప్రదేశం కాదని నాయకులు అర్ధం చేసుకోవాలని కోరారు. ఏ రాజకీయ నేతను ఆసుపత్రిలోకి అనుమతించలేదని పేర్కొన్నారు.
హర్యానా రాష్ట్రంలోని భీవానికి చెందిన గ్రెవాలే విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తోటి జవానుల కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నట్లు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని సుబేదార్ గ్రెవాల్ కుమారుడు రామ్ క్రిష్ణ గ్రెవాల్ తెలిపారు. దేశం కోసం ఎంతో కష్ట పడిన మాజీ సైనికోద్యోగులందరికీ వన్ ర్యాంకు-వన్ పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని జంతర్ మంతర్ వద్ద వారు గతేడాది నిరసనలు చేసిన సంగతి తెలిసిందే.
80 రోజుల మాజీ సైనికోద్యోగుల ఆందోళనలకు దిగొచ్చిన ప్రభుత్వం, ఆ పథకాన్ని అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, తమ నాలుగు ప్రాథమిక పరిస్థితులను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్టు మాజీ సైనికోద్యోగులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలుచేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.