పోలీసులు అమ్మాయిలని కూడా చూడకుండా..
న్యూఢిల్లీ: కొట్టారు.. జుట్టుపట్టిలాగారు. ఈడ్చి తన్నారు. చెంపదెబ్బలు కొడుతూ నేలకేసి కొట్టారు. ఎవ్వరూ ఊహించనట్లుగా పోలీసులు, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కటయ్యారు. ఢిల్లీలోని ఆరెస్సెస్ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లినవారిని చితక్కొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వారిపై విరుచుకుపడ్డారు. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతడికి మద్దతుగా కొందరు విద్యార్థులు, విద్యార్థినులు ఆరెస్సెస్ కార్యాలయం వద్దకు తమ నిరసన తెలిపేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని బారీకేడ్స్ వద్ద అడ్డుకున్నారు. వారు మాట్లాడుతుండగానే గుర్తు తెలియని వ్యక్తులు అనూహ్యంగా ఆ విద్యార్థులపై దాడికి దిగారు.
ఆ సమయంలో వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా దాడి చేసినవారికి తోడై లాఠీలు ఝులిపించారు. జుట్టుపట్టుకొని లాగి మరీ కొట్టారు. అమ్మాయిలను సైతం వదిలిపెట్టలేదు. కర్రలు తీసుకొని కిందపడేసి కాళ్లతో తొక్కుతూ.. ఒక్కడిపై ఐదారుగురు పిడిగుద్దులు గుద్దుతూ ఇష్టమొచ్చినట్లు కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా, ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా శరీరం చితికిపోయేట్లు కొట్టారు. ఈ దాడికి సంబంధించి వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం సోషల్ మీడియాలో పెట్టగా అది వెలుగులోకి వచ్చింది. దీనిని చూసిన పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పారు.