
రోహిత్ కులాన్ని ఎన్ని సార్లు పరీక్షిస్తారు?
సాక్షి, హైదరాబాద్: దళితులు మరణించిన తరువాత కూడా పదేపదే తమ కులాన్ని రుజువు చేసుకోవాల్సి రావడం దారుణమని హెచ్‌సీయూ ఎస్‌సీ, ఎస్‌టీ టీచర్స్ అసోసియేషన్ కన్వీనర్ ప్రొఫెసర్ సుధాకర్ బాబు అన్నారు. సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రోహిత్ వేముల కులాన్ని ఎన్నిసార్లు ధృవీకరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు సార్లు రోహిత్ దళితుడని ప్రభుత్వమే ధృవీకరించిందని, జాతీయ ఎస్సీ కమిషన్ అదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఇప్పటికైనా కులంపై చర్చకు స్వస్తిపలికి, రోహిత్ మరణానికి కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రొఫెసర్ లక్ష్మినారాయణ అన్నారు.
దీనిపై రాష్ట్ర హోంమంత్రిని కలిసినట్లు తెలిపారు. రోహిత్‌ను భరత మాత ముద్దుబిడ్డగా పేర్కొన్న ప్రధాని మోదీ అతను దళితుడన్న విషయాన్ని చెప్పలేదని ప్రొఫెసర్ రత్నం అన్నారు. రోహిత్ కేసులో జాప్యాన్ని ప్రశ్నించినందుకు తమను జైల్లో పెట్టారన్నారు. ప్రొఫెసర్ క్రిష్ణ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని కోరారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ శ్రీపతిరాముడు అన్నారు.