రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవడంలో వైఫల్యం
నేడు బస్సుజాత ఆర్‌యూకు రాక
విజయవంతానికి
విద్యార్థి జేఏసీ పిలుపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవడంలో కేంద్ర సర్కారు పూర్తిగా విఫలమైందని విద్యార్థి జేఏసీ నాయకులు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య చోటు చేసుకుని నెల రోజులు గడుస్తున్నా కేంద్రప్రభుత్వ పెద్దలు బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటామన్న మంత్రుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. రోహిత్ మృతిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, వైఎస్సార్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు జేఏసీగా ఏర్పడి చేపట్టిన బస్సుజాత శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీకి రానుంది.
క్రమంలో వర్సిటీ సీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు చంద్రశేఖర్(ఏఐఎస్‌ఎఫ్), ఎమ్మార్ నాయక్(ఎస్‌ఎఫ్‌ఐ), భాస్కర్(పీడీఎస్‌యూ), నాగమధుయాదవ్(ఎన్‌ఎస్‌యూఐ), అనిల్‌కుమార్(వైఎస్‌ఆర్‌ఎస్‌యూ) విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రోహిత్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సుజాతను విజయవంతంచ చేయాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కఠిన చట్టాలను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేంద్ర, శివ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.